- మార్చి 29న ఇంద్ర పార్క్‌లో మహాధర్నా
- ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్
హైదరాబాద్ సిటీ ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 29న హైదరాబాద్‌లోని ఇంద్ర పార్క్ వేదికగా నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ, విద్యా కమిషన్ సభ్యుడు విశేశ్వర్ రావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఏజెన్సీ వ్యవస్థ పూర్తిగా దోపిడీ వ్యవస్థగా మారిందని విమర్శించారు. ఈ వ్యవస్థలో రౌడీయిజం, గుండాయిజం తరహాలో వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. అందువల్ల ఈ దళారీ వ్యవస్థను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం నిర్వహిస్తున్న మహాధర్నాకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమైనవని, వారి డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోయిపడి శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు బాలకృష్ణారెడ్డి, క్రాంతికుమార్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.