డీఐఈఓపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
అనుమతి లేని కళాశాలలను సీజ్ చేయాలని హెచ్చరిక
హైదరాబాద్/మేడ్చల్-మల్కాజిగిరి, జూన్ 15 (వార్త సంధ్య): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఖుత్బుల్లాపూర్ మండలం చింతల్‌లోని భాషిత జూనియర్ కళాశాలలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రటరీ కుందన్ యాదవ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్ మాట్లాడారు.
కళాశాల యాజమాన్యం ఫైర్ అనుమతుల కోసం ఐదు అంతస్తుల భవనాన్ని నాలుగు అంతస్తులుగా చూపిస్తూ అనుమతులు పొందిందని వారు ఆరోపించారు. వాస్తవానికి భవనంలో ఐదు అంతస్తులు, పెంట్‌హౌస్ నిర్మాణం ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల వద్ద భిన్న సమాచారం సమర్పించారని పేర్కొన్నారు.
అలాగే ఒకే కళాశాల కోడ్ నంబర్‌తో మూడు విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. చింతల్‌లోని భాషిత జూనియర్ కళాశాలతో పాటు కొంపల్లిలోని సాయితేజ కళాశాల, ప్రీతమ్ జూనియర్ కళాశాలలు కూడా అదే కోడ్ నంబర్‌తో నడుస్తున్నాయని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కళాశాల భవనాన్ని ప్రైవేట్ కోచింగ్ సంస్థలకు అద్దెకు ఇస్తున్నారని, అదే భవనంలో హాస్టల్ కూడా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించి అధికారిక అనుమతులు లేవని ఆర్‌టీఐ ద్వారా సమాచారం లభించిందని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు, మెటీరియల్ చార్జీలు వసూలు చేస్తున్నారని, ప్రశ్నించిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఆరోపించారు.
ఈ అంశాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఇంటర్ బోర్డు అధికారులు, ఫైర్ శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖలను పలుమార్లు కలిసినప్పటికీ చర్యలు కనిపించడం లేదని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలు, అనుమతుల అంశంపై తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భాషిత జూనియర్ కళాశాలతో పాటు అనుమతి లేని అనుబంధ కళాశాలలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డీఐఈఓ కార్యాలయాల ముట్టడి సహా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.