Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 4:15 pm Posted by : VARTHA SANDHYA DESK

మూసీ పునరుజ్జీవంపై బీఆర్ఎస్ విషప్రచారం: మధుయాష్కి గౌడ్

  • గోదావరి నీటితో మూసీ శుద్ధికి ప్రభుత్వం కృషి
  • ఉప్పల్‌లో కార్పొరేషన్ కార్యాలయ స్థలం పరిశీలన

ఎల్బీనగర్ ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య):మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ నాయకులు విషప్రచారం చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం గోదావరి నీటిని పారించి మూసీ నదిలోని కాలుష్యాన్ని తొలగించేందుకు కృషి చేస్తుండగా, ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.మంగళవారం ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ స్థలాన్ని మధుయాష్కి గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, భారీ నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేపడుతున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ నిధులను కాలేశ్వరం ప్రాజెక్ట్‌కు మళ్లించి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో దోపిడీ పెరిగిందని, కేటీఆర్ దోపిడీ నాయకులకు నాయకుడిగా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే ఉప్పల్ నియోజకవర్గానికి రూ.260 కోట్లకు పైగా, ఎల్బీనగర్‌కు రూ.250 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు వివరించారు.మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌లో ఇల్లు కోల్పోయే వారికి గృహ నిర్మాణం, నష్టపరిహారం అందజేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఇందుకు రూ.10 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. మంచి పనులను ప్రతిపక్షం అభినందించాల్సింది పోయి ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ప్రచారం చేయడం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, ఉప్పల్ భగాయత్‌లో కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు వల్ల ప్రజలకు పౌర సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.