ముఖేష్ గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలి
జూలై 1 జయంతి నాటికి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి
బీసీ ల బిడ్డలు రేవంత్ అన్న నీకు కనపడలేదా..?
లేదంటే ప్రజల సహకారంతో మేమే విగ్రహం ఏర్పాటు చేస్తాం: అంబర్‌పేట్ శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, జూన్ 15 (వార్త సంధ్య): దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ జయంతి అయిన జూలై 1వ తేదీ నాటికి ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, లేకపోతే అభిమానులు, అనుచరుల సహకారంతో తామే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని కాంగ్రెస్ నాయకుడు అంబర్‌పేట్ శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రజాసేవలు, నాయకత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెండుసార్లు కలిసి ముఖేష్ గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ముఖేష్ గౌడ్ హైదరాబాద్ నగర అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖేష్ గౌడ్ కీలకంగా పనిచేశారని అన్నారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన ముఖేష్ గౌడ్‌కు మాత్రం తగిన గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. బీసీ నాయకులకు తగిన గౌరవం దక్కడం లేదనే భావన కార్యకర్తల్లో పెరుగుతోందన్నారు.
ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ట్రస్ట్ ద్వారా వందలాది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందుతున్న విషయాన్ని గుర్తు చేసిన శ్రీనివాస్ యాదవ్, సమాజానికి ఆయన కుటుంబం చేస్తున్న సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ముఖేష్ గౌడ్ జయంతి నాటికి ప్రభుత్వం అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొజంజాహి మార్కెట్, ట్యాంక్‌బండ్ లేదా ఆయన నివాస ప్రాంతంలో ప్రభుత్వ లాంఛనాలతో విగ్రహం ప్రతిష్ఠిస్తే అభిమానులందరికీ సంతోషంగా ఉంటుందని అన్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు కలిసి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, డివిజన్లలో ఉన్న ముఖేష్ గౌడ్ అభిమానులు ఈ ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు.
ముఖేష్ గౌడ్ సేవలను భావితరాలకు చాటిచెప్పేందుకు ఆయన జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు అవసరమని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు