ఆన్‌లైన్ కోర్సులు, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ల విస్తరణకు శ్రీకారం
టూరిజం, లాజిస్టిక్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులు త్వరలో ప్రారంభం
గ్రామీణ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ లక్ష్యం
నల్గొండ, జూన్ 18 వార్త సంధ్య : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం మరియు తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్ (టీ-సాట్) సంయుక్త ఆధ్వర్యంలో మరిన్ని ఆన్‌లైన్ తరగతులు, కొత్త సర్టిఫికెట్ కోర్సుల ప్రారంభానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఎంజీయూ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీ-సాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో ఇరు సంస్థలు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నాయి.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయం అందిస్తున్న విద్యా అవకాశాలు మరింత విస్తృతంగా, ఉపయోగకరంగా మారనున్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పరిమిత వనరులు ఉన్న ప్రాంతాల్లోని యువతకు, ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే వారికి ఆన్‌లైన్ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నాణ్యమైన పాఠ్యాంశాలు, వ్యవహారిక శిక్షణా మాడ్యూల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగేలా కోర్సులను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో ఇతర విభాగాల కోర్సులను కూడా ఈ భాగస్వామ్యంలో చేర్చాలని ఆకాంక్షించారు.
టీ-సాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక పరిమితుల కారణంగా ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణకు దూరమవుతున్న వర్గాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే టీ-సాట్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాల ద్వారా విద్యా అవకాశాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లను రూపొందించి, విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు టీ-సాట్ కృషి చేస్తోందన్నారు.
గతంలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం నిర్వహించిన టూరిజం మేనేజ్‌మెంట్ డిజిటల్ తరగతులకు వచ్చిన మంచి స్పందనను దృష్టిలో ఉంచుకుని, టూరిజం మేనేజ్‌మెంట్‌తో పాటు లాజిస్టిక్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. లైవ్ లెక్చర్లు, రికార్డెడ్ పాఠ్యాంశాలు, అసైన్‌మెంట్లు, వర్క్‌షాప్‌లతో రూపొందించిన శిక్షణా మాడ్యూల్స్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన టూరిజం ఆన్‌లైన్ తరగతులను మరింత విస్తరించడంతో పాటు, ఈ ఒప్పందం ద్వారా కొత్త సర్టిఫికెట్ కోర్సులను కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీ-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాదిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, ఎంజీయూ మేనేజ్‌మెంట్ డీన్ ఆచార్య అలవాల రవి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, డా. సభినా హరాల్డ్, డా. మిరియాల రమేష్, డా. మారం వెంకట రమణారెడ్డి, డా. లక్ష్మీప్రభ, ఆచార్య శ్రీలక్ష్మి, డా. శ్వేత, డా. అనురాధ, డా. జక్క సురేష్ రెడ్డి, డా. కట్ట కిరణ్ మై, డా. జ్యోతి, రమేష్ నాయక్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.