Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 2:18 pm Posted by : VARTHA SANDHYA DESK

తండ్రి చికిత్స కోసం సీజ్‌ చేసిన బంగారం తాకట్టు.. కానిస్టేబుల్‌ అరెస్ట్‌!

రూ.12.37 లక్షలు రుణంగా పొందినట్లు ఆరోపణలు

మరో కేసులో సీజ్‌ చేసిన సెల్‌ఫోన్‌ నుంచి రూ.1.70 లక్షల అక్రమ బదిలీ

మీర్పేట, అక్టోబర్ 31 (వార్త సంధ్య): ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోనే సీజ్‌ చేసిన సొత్తు దుర్వినియోగం ఘటన వెలుగులోకి వచ్చింది. కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, సెల్‌ఫోన్లను అక్రమంగా వినియోగించిన ఆరోపణలపై మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్‌ అరెస్టయ్యాడు.

ఒక కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ నుంచి రూ.1.70 లక్షలను అక్రమంగా తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో కేసులో సీజ్‌ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.12.37 లక్షల నగదును పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

తండ్రి చికిత్స కోసమేనని వెల్లడి!

తన తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన వైద్య చికిత్సకు అవసరమైన డబ్బు సమకూర్చుకునేందుకే ఈ చర్యలకు పాల్పడినట్లు శ్రవణ్‌ వెల్లడించినట్లు తెలిసింది. అయితే, ఆయన తండ్రి ఇటీవలే మరణించినట్లు సమాచారం.

కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు

సీజ్‌ చేసిన సొత్తు దుర్వినియోగం వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు కానిస్టేబుల్‌ శ్రవణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

సీజ్‌ చేసిన సొత్తుకు భద్రత ఏది?

ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్న పోలీసు సిబ్బందే ఇలా వ్యవహరిస్తే, కేసుల దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న ఆస్తుల భద్రతపై ప్రజల్లో నమ్మకం ఎలా నిలుస్తుంది? పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచే బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువుల నిర్వహణలో ఎలాంటి పర్యవేక్షణ ఉంది? సీజ్‌ చేసిన సొత్తు భద్రతకు మరింత పారదర్శకమైన విధానాలు అవసరమనే విషయాన్ని ఈ ఘటన మరోసారి ప్రశ్నిస్తోంది