Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 2:54 pm Posted by : VARTHA SANDHYA DESK

అన్నపురెడ్డిపల్లి లో ఆధ్యాత్మిక వెల్లువ

శ్రీవారి సన్నిధిలో వైభవంగా ‘మహా కుంభాభిషేకం’

సతీసమేతంగా పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అన్నపురెడ్డిపల్లి, వార్త సంధ్య, మే 06:

అన్నపురెడ్డిపల్లి గ్రామం బుధవారం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. శ్రీశ్రీశ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవం భక్తి పారవశ్యంతో సాగింది. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

లోక కల్యాణార్థం నిర్వహించిన ఈ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సతీసమేతంగా పాల్గొన్నారు. పరమపూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి దివ్య పర్యవేక్షణలో ఈ క్రతువు అత్యంత వైభవంగా జరిగింది.

బ్రహ్మ ముహూర్తం నుంచే అర్చక బృందం హోమగుండాల వద్ద వేద మంత్రోచ్చారణల మధ్య జపాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం చినజీయర్ స్వామి వారి దివ్య హస్తాల మీదుగా కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేయగా, భక్తుల జయజయధ్వానాలతో దిక్కులు మార్మోగాయి. ఈ మహత్తర ఘట్టాన్ని మంత్రి పొంగులేటి దంపతులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు.

తరువాత జరిగిన వేదాశీర్వచన కార్యక్రమంలో పండితులు మంత్రి దంపతులకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ, “చినజీయర్ స్వామి వారి పావన హస్తాల మీదుగా ఈ కుంభాభిషేకం జరగడం మనందరికీ గొప్ప అదృష్టం. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నెలకొనాలని ప్రార్థించాను” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా కలెక్టర్ అంకిత్, డీసీసీ అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి భక్తులను ఆకట్టుకుంది.