Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:59 am Posted by : VARTHA SANDHYA DESK

డప్పు కొట్టే మాదిగలకు నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు టీఎంఆర్పీఎస్ వినతి

చండ్రుగొండ, ఆగస్టు 18 (వార్త సంధ్య): సంప్రదాయ కళ అయిన డప్పును వాయిస్తూ జీవనం సాగిస్తున్న మాదిగ కళాకారులకు నెలకు రూ.5 వేల పెన్షన్‌ మంజూరు చేయాలని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎంఆర్పీఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు.

టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుండా రమేష్‌ మాదిగ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి మాదిగల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డప్పు కొడుతూ తరతరాలుగా సంప్రదాయ కళను కొనసాగిస్తున్న మాదిగ కళాకారులకు ప్రభుత్వం నెలకు రూ.5 వేల పెన్షన్‌ అందించాలని కోరారు.

అలాగే మాదిగ దండోరా ఉద్యమకారులకు 200 గజాల చొప్పున స్థలం కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన దళితులకు ‘అంబేద్కర్‌ అభయహస్తం’ పథకం కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించారు. మాదిగల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు జీడి శ్రీనివాస మాదిగ (జె. శ్రీను), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మచ్చ పృథ్వీరాజ్‌ మాదిగ, టీఎంవైఎస్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మెర అశోక్‌ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.