Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 9:02 pm Posted by : VARTHA SANDHYA DESK

రోడ్డు పనుల పేరుతో ప్రజా ఆస్తుల ధ్వంసం… బాధ్యత ఎవరిది?

  • జెసిబితో తవ్వి వదిలేసిన సిమెంట్ రోడ్డు పనులు
  • డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నా పట్టించుకోని కాంట్రాక్టర్
  • “రోడ్డు వేయడమే మా పని” అంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం
  • ఇంజనీర్ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం
  • బిజెపి కార్పొరేట్ కార్యాలయం ముందే నిర్లక్ష్యం వెలుగులోకి

ఎల్బీనగర్ ప్రతినిధి,ఏప్రిల్ 29 (వార్త సంధ్య): ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారం డివిజన్‌లో ఉన్న వివేకానంద నగర్ కాలనీలో రోడ్డు పనులు ప్రజలకు ఉపశమనం ఇవ్వాల్సింది పోయి ఇబ్బందులకు దారితీస్తున్నాయి. సిమెంట్ రోడ్డు మరమ్మత్తుల పేరుతో జెసిబి యంత్రాలతో పాత రోడ్లను తొలగించిన కాంట్రాక్టర్, పనులను పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా రోడ్డు తొలగింపు సమయంలో పక్కనే ఉన్న డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నా, దాని పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఈ విషయంపై స్థానికులు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, “రోడ్డు తొలగించడం, కొత్త రోడ్డు వేయడం వరకే మా బాధ్యత. ఆ సమయంలో ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే అది మా పరిధిలోకి రాదు. ఇంజనీర్ ఆదేశిస్తే మాత్రమే మరమ్మతులు చేస్తాం” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ప్రజలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం వ్యవహారం బిజెపి కార్పొరేట్ కార్యాలయం సమీపంలోనే జరుగుతుండటం. ప్రజా ప్రతినిధుల కార్యాలయాల ముందే ఇలాంటి నిర్లక్ష్యం కనిపిస్తుండటం అధికార వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత ఇంజనీర్ నుంచి సరైన స్పందన రాకపోవడం మరింత అసంతృప్తికి దారితీస్తోంది.

ప్రజా ఆస్తులైన డ్రైనేజీ వ్యవస్థలు ధ్వంసమవుతున్నప్పటికీ, కాంట్రాక్టర్ మరియు అధికారులు బాధ్యత తీసుకోకుండా పరస్పరం నెట్టుకొస్తున్న తీరు ప్రజలకు నష్టాన్ని కలిగిస్తోంది. ప్రజల సౌకర్యాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు, సరైన పర్యవేక్షణ లేకపోతే ఎలా సమస్యలుగా మారతాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.