Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 4:08 pm Posted by : VARTHA SANDHYA DESK

అష్టాచమ్మ ఆడుకుంటున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు!

బొక్కలు పెట్టి వదిలేస్తారూ..? బిల్డర్లు బిల్డింగులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటారు ?

కొత్తపేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు అక్రమ నిర్మాణాల జోరు

బైరామల్‌గూడ, బహదూర్‌గూడలోనూ యథేచ్ఛగా నిర్మాణాలు.. అధికారుల చర్యలు నామమాత్రమేనా?

టౌన్‌ప్లానింగ్‌ అధికారిణి అర్చన, ఏసీపీ అంబికా పర్యవేక్షణపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్‌,నవంబర్ 04, వార్త సంధ్య:

అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో కథనాలు వస్తే హడావుడి చేయడం.. నిర్మాణాల వద్దకు వెళ్లి బొక్కలు పెట్టడం.. నోటీసులు జారీ చేయడం.. ఆ తర్వాత కొద్దిరోజులు గడవగానే అటువైపు కన్నెత్తి చూడకపోవడం! ఇదీ ఎల్బీనగర్‌–సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల వ్యవహారశైలిపై వినిపిస్తున్న తీవ్ర విమర్శలు. అధికారులు చర్యలు తీసుకున్నామని చెప్పుకుంటుంటే, మరోవైపు బిల్డర్లు మాత్రం అదే నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చినా, పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమైనా పరిస్థితిలో మార్పు లేకపోవడం వెనుక అసలు కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణదారులకు అధికారులు అండగా నిలుస్తున్నారా? ముడుపుల ఆరోపణల్లో నిజానిజాలేమిటి? ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

గతంలో  మాజీ కార్పొరేటర్‌కు సంబంధించిన భవన నిర్మాణ వ్యవహారం 

200 గజాల చొప్పున రెండు అనుమతులు.. నిర్మాణాలు మాత్రం ఆగవు !

కొత్తపేట సిగ్నల్‌ సమీపంలోని మోర్‌ ఆసుపత్రి పక్కన మాజీ కార్పొరేటర్‌కు సంబంధించిన భవన నిర్మాణ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుమారు 200 గజాల చొప్పున రెండు వేర్వేరు అనుమతులు తీసుకొని  నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. ఇదే విధంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని సత్యనారాయణ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న గల్లీలోనూ మరో నిర్మాణం కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణాలపై గతంలో అభ్యంతరాలు వ్యక్తమవడంతో అధికారులు బొక్కలు పెట్టి పనులు నిలిపివేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ పనులు కొనసాగి నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకోవడం, ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్నాయనే ఆరోపణలు అధికారుల చర్యలపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకసారి నిబంధనల ఉల్లంఘన గుర్తించిన అధికారులు, తిరిగి అదే నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఎందుకు పర్యవేక్షించలేకపోయారన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.

బైరామల్‌గూడలో ఐరన్‌ షెడ్‌.. రెండంతస్తులు పూర్తి!

ఇప్పుడు ……                                                   వార్తకు ముందు

బైరామల్‌గూడలోని ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా నిర్మిస్తున్న ఐరన్‌ షెడ్‌ వ్యవహారం కూడా విమర్శలకు కేంద్రంగా మారింది. మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో అంతస్తు పనులు కూడా పూర్తయ్యాయని, ప్రస్తుతం భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. నిర్మాణ అనుమతులు ఏమిటి? వాస్తవంగా ఎలాంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు? నిర్మించిన అంతస్తులకు ఆ అనుమతులు వర్తిస్తాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గతంలో ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చినప్పటికీ నిర్మాణం ఈ స్థాయికి ఎలా చేరుకుందన్నది కీలకంగా మారింది.

బహదూర్‌గూడలోనూ అదే బాగోతం!

బహదూర్‌గూడ ప్రాంతంలోనూ షెడ్‌ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. పలు ప్రాంతాల్లో నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తమైనా, నోటీసులు జారీ చేసినా, పనులు నిలిపివేసినట్లు చూపించినా చివరకు నిర్మాణాలు పూర్తవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కేవలం నోటీసులకే పరిమితమవుతున్నారా? లేక నిర్మాణదారులు తమ పనులు పూర్తిచేసుకునే వరకు ఉద్దేశపూర్వకంగా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు స్థానికుల్లో బలపడుతున్నాయి.

 

ఇప్పుడు ……                                                   వార్తకు ముందు

నోటీసులు ఒకవైపు.. నిర్మాణాలు మరోవైపు!

టౌన్‌ప్లానింగ్‌ విభాగం నుంచి పలు నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల పనులు నిలిపివేసినట్లు కూడా చెబుతున్నారు. అయితే నోటీసులు అందుకున్న తర్వాత కూడా నిర్మాణాలు తిరిగి కొనసాగితే వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అనుమతులకు మించి అంతస్తులు నిర్మిస్తే వాటిని పరిశీలించి చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం లేదా? నోటీసులు జారీ చేయడం, బొక్కలు పెట్టడం మాత్రమే ప్రభుత్వ విధి నిర్వహణ అవుతుందా? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

నిర్మాణాలు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన చైన్‌మన్లు, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఏం చేస్తున్నారన్నది మరో ప్రశ్న. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించారా? అందించినట్లయితే తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదు? సమాచారం అందించకపోతే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

ముడుపుల ఆరోపణలు.. ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తారా?

అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు, యజమానులు, భూముల యజమానుల నుంచి కొందరు అధికారులు ముడుపులు అందుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. డబ్బులు చేతులు మారిన తర్వాతే నిర్మాణాలపై చర్యలు నిలిచిపోతున్నాయా? మొదట హడావుడి చేసి ఆ తర్వాత నిర్మాణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను నిర్ధారించాల్సిన బాధ్యత అవినీతి నిరోధక శాఖతో పాటు సంబంధిత ఉన్నతాధికారులపై ఉంది. ఆరోపణలు నిజమో కాదో తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.

ఎల్బీనగర్‌–సరూర్‌నగర్‌ పరిధిలో టౌన్‌ప్లానింగ్‌ అధికారిణి అర్చన, ఏసీపీ అంబికా, క్షేత్రస్థాయి చైన్‌మన్ల పర్యవేక్షణలో నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలి. గతంలో పత్రికల్లో వరుస కథనాలు వచ్చినప్పటికీ, ఫిర్యాదులు అందినప్పటికీ, నిర్మాణాలు తిరిగి పూర్తయ్యే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

అష్టాచమ్మ ఆటలా అధికారుల వ్యవహారం?

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు వచ్చినప్పుడు ఒకసారి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం.. కొంతకాలానికి మళ్లీ నిర్మాణాలు కొనసాగడం.. చివరకు బిల్డర్లు భవనాలను పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాలు చేసుకోవడం చూస్తుంటే అధికారుల చర్యలు అష్టాచమ్మ ఆటను తలపిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పత్రికల్లో వార్తలు వస్తే స్పందించినట్లు నటించి, ఆ తర్వాత మళ్లీ పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు పొందింది జీతాలు తీసుకోవడానికేనా? లేక ప్రజలకు సేవ చేయడంతోపాటు ప్రభుత్వ ఆస్తులు, ఆదాయాన్ని కాపాడటానికా? నిబంధనలు పాటిస్తూ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టే వారికి ఒక న్యాయం, నిబంధనలు ఉల్లంఘించే వారికి మరో న్యాయమా? అనే ఆగ్రహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ప్రజల ఫిర్యాదులకు స్పందించకపోవడం, అక్రమ నిర్మాణాలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అధికార యంత్రాంగంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

డిసీ నుంచి ఉన్నతాధికారుల వరకు స్పందన ఏది?

గతంలోనూ ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంపై వార్త సంధ్య పలు కథనాలను ప్రచురించింది. అయినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బల్దియా ఉన్నతాధికారులు, జోనల్‌ కమిషనర్‌, టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేక మరోసారి నోటీసులతోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాలి.

కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, బైరామల్‌గూడ, బహదూర్‌గూడ ప్రాంతాల్లోని నిర్మాణాలకు సంబంధించిన అనుమతి పత్రాలు, భవన నిర్మాణ ప్రణాళికలు, క్షేత్రస్థాయి తనిఖీ నివేదికలు, జారీ చేసిన నోటీసులు, తదుపరి చర్యల వివరాలను బహిర్గతం చేయాలి. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ముడుపుల ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

బొక్కలు పెట్టి వదిలేస్తే సరిపోదు.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి! ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, పత్రికల్లో వెలువడుతున్న కథనాలు, కళ్లముందే పూర్తవుతున్న నిర్మాణాలు.. ఇవన్నీ అధికార యంత్రాంగానికి కనిపించడం లేదా? కనిపిస్తే చర్యలు ఎందుకు లేవు? అన్నదే ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న. అధికారులు సమాధానం చెప్పాలి.. ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలి!