Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 10:32 pm Posted by : VARTHA SANDHYA DESK

ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరో మణిహారం: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

  • ఫ్లైఓవర్ క్రింద నూతన క్రీడా మైదానాల ఏర్పాట్లు

  • యువత, చిన్నారులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సదుపాయాలు

  • ఉచిత ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే


హయత్‌నగర్ ప్రతినిధి, మార్చి 16 (వార్త సంధ్య): ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల కోసం మరో ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆలేఖ్య టవర్స్ నుంచి ఎల్.బి.నగర్ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా నిర్మించిన క్రీడా మైదానాలను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఫ్లైఓవర్ల క్రింద ఉన్న ఖాళీ స్థలాన్ని వృథా కాకుండా చిన్నారులు, యువత మరియు సీనియర్ సిటిజన్ల కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆట మైదానాలు, వాకింగ్ ట్రాక్‌లు మరియు సేదతీరేందుకు బల్లలు ఏర్పాటు చేయాలని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి ఫ్లైఓవర్ల క్రింద క్రీడా మైదానాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.దీనిలో భాగంగా ఎల్.బి.నగర్ కామినేని ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ క్రింద వేలాది మొక్కలతో ఒక అద్భుతమైన ఆక్సీజన్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ప్రజలు కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణంలో వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

అదేవిధంగా సాగర్ రింగ్ రోడ్ వద్ద ఆలేఖ్య టవర్స్ నుంచి ఎల్.బి.నగర్ వైపు వెళ్లే రహదారిపై కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఈ పనుల సమయంలో 02.02.2022న సుధీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఆర్‌డీపీ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఫ్లైఓవర్ క్రింద క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని సూచించారు.తదనంతరం 09.03.2024న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్కై ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం 20.05.2025న ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్‌ను కలిసి ఫ్లైఓవర్ క్రింద క్రీడా మైదానాల ఏర్పాటుకు నిధులు మంజూరు అయిన విషయాన్ని గుర్తు చేస్తూ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. కమిషనర్ హామీ మేరకు పనులు ప్రారంభమై ప్రస్తుతం పూర్తయ్యాయి.దీంతో ప్రస్తుతం ఫ్లైఓవర్ క్రింద క్రికెట్ మైదానం, వాలీబాల్ మరియు షటిల్ కోర్టులు నిర్మించబడ్డాయి. ఈ క్రీడా మైదానాల్లో చిన్నారులు ఉత్సాహంగా ఆటలు ఆడుతూ సమయాన్ని సార్థకం చేసుకుంటున్నారు.ఈ క్రీడా మైదానాల్లో చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా అక్కడ ఒక అద్భుతమైన స్తూపం నిర్మించాలని కూడా సూచించారు.