వికారాబాద్, జూలై 23 (వార్త సంధ్య):
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలో గురువారం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
వికారాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రామయ్యగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పలకలను అందజేశారు. అనంతరం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి రోగులు, వారి బంధువులకు పంపిణీ చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ మెతుకు ఆనంద్ రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని పాలనను మళ్లీ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు ఆశించిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆరోపించారు. గతంలో ఉన్న పథకాలే కనుమరుగవుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి భాషా శైలి పట్ల కూడా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని అన్నారు.
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సౌకర్యాలు కూడా సరిగా లేవని, “సూది ఉంటే దూది లేదు.. దూది ఉంటే సూది లేదు” అనే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అలాగే రామయ్యగూడ ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరిన భవనాలు విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారాయని, వాటిని తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా వికారాబాద్‌లో పాడుబడిన భవనాలను తొలగించి అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం పట్టణ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.
చివరగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం, పాలనపై దృష్టి సారించాలని డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు.