- తూకంలో పారదర్శకత పాటించి రైతులకు అండగా నిలవాలి
- మద్దతు ధర దక్కేలా అధికారులు, ఐకేపి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
- తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దు
- దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించ్చవద్దు
- కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలి
- చెల్లింపులు సకాలంలో జరిగేలా పర్యవేక్షణ వేగవంతం చేయాలి

పెనగడపలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : నియోజకవర్గానికి ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.బుధవారం చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో నూతనంగా మంజూరైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కృషితో అధిక సంఖ్యలో కేంద్రాలను మంజూరు చేయించామని పేర్కొన్నారు.కొనుగోలు ప్రక్రియలో అధికారులు, ఐకేపీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా తూకంలో పూర్తి పారదర్శకత పాటించాలని, తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని హెచ్చరించారు. సరిపడ గోనె సంచులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రైతులు పండించిన ప్రతి గింజ ఐకేపీ ద్వారా కొనుగోలు జరుగుతుందని, దళారుల మాయమాటలు నమ్మి తక్కువ ధరకు విక్రయించవద్దని కోరారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, చెల్లింపులు సకాలంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు పక్షపాతిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఎంపిడివో శుభాషిణి, తహసీల్దార్ నాగరాజు, సర్పంచ్ కారం సీతారాములు, ఉప సర్పంచ్ గోరె బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, నాయకులు నీడలా సుధాకర్, కుంచం కుమార్, కట్ట సత్యనారాయణ, మేఘనాధం, తాజుద్దీన్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
.