Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 1:05 pm Posted by : VARTHA SANDHYA DESK

కొడంగల్ ఓటర్ల జాబితాపై అనుమానాలు..

 ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత

భోదన్‌లో 7 వేల ఓట్లు తొలగింపు.. కొడంగల్‌లో కేవలం 808 మాత్రమే ఎందుకు?

ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ రక్షణ సేన ప్రశ్నలు

 

హైదరాబాద్, జూన్ 29 (వార్త సంధ్య ): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో డూప్లికేట్, అంతర్రాష్ట్ర ఓట్ల అంశంపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

బంజారాహిల్స్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా శుద్ధి జరుగుతున్న తీరు అనేక సందేహాలకు తావిస్తోందన్నారు.

కవిత మాట్లాడుతూ, సాధారణంగా ఓటర్ల జాబితా సవరణకు ప్రతి ఏడాది జనవరి 1నే రిఫరెన్స్ తేదీగా తీసుకుంటారని, అయితే ఎస్‌ఐఆర్‌లో 2025 జనవరి ఆధారంగా ప్రక్రియ చేపట్టడం వెనుక కారణాలను ఎన్నికల సంఘం స్పష్టం చేయాలని కోరారు.

భోదన్ నియోజకవర్గంలో గత ఏడాదిన్నర కాలంలో 7 వేలకుపైగా ఓట్లు తొలగించగా, అదే సమయంలో కొడంగల్‌లో కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తొలగించిన ఓటర్లకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 22 వేలకుపైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, వాటిలో వెయ్యి ఓట్లకు సంబంధించిన వివరాలను తాము సేకరించామని కవిత పేర్కొన్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని సెడం నియోజకవర్గంలో ఓటు ఉన్న సుమారు 11 వేల మంది పేర్లు కొడంగల్ ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయని ఆరోపించారు.

ఈ సంఖ్యలను కలిపితే దాదాపు 33 వేల ఓట్లు అవుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాదాపు అదే మెజారిటీతో గెలిచారని పేర్కొంటూ, ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న కవిత, “వన్ నేషన్ – వన్ ఎలక్షన్ – వన్ ఓటు” విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాల మధ్య డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే సమర్థమైన వ్యవస్థ ఎన్నికల సంఘం వద్ద ఉండాలని అభిప్రాయపడ్డారు.

సంచార జాతులు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే ప్రజల ఓటు నమోదు ప్రక్రియపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, ఒకే కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా శాశ్వత పరిష్కారంగా మారాలంటే అంతర్రాష్ట్ర డూప్లికేట్ ఓట్ల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తాము లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కవిత విజ్ఞప్తి చేశారు.