Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:12 pm Posted by : VARTHA SANDHYA DESK

ఫీజుల దోపిడీపై గళమెత్తిన కల్వకుంట్ల కవిత

  • నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశం
  • మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్

హైదరాబాద్, వార్త సంధ్య, మే 06: హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ” రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యా వ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కవిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరించడం రాష్ట్రానికి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్కూల్ ఫీజులు 50 శాతం నుంచి 120 శాతం వరకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యా రంగంలో ప్రజల పట్ల సంవేదనతో పాలన సాగలేదని విమర్శించారు.

ఫీజుల నియంత్రణకు చట్టం అవసరం

మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. పిల్లల చదువు బాధ్యత కేవలం తల్లిదండ్రులదే కాదు, ప్రభుత్వానిదీ కాదా అని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా విద్యా రంగంలో వ్యాపార ధోరణి పెరిగిందని, ముఖ్యంగా రాజకీయ నాయకులే విద్యాసంస్థలను నడపడం ఆందోళనకరమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల బలహీనతను వ్యాపారంగా మార్చి ఫీజుల దోపిడీ జరుగుతోందని విమర్శించారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై విమర్శలు

ప్రభుత్వ భూమిలో నడుస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే 120 శాతం ఫీజులు పెంచడం దురదృష్టకరమని అన్నారు. అదే పరిస్థితి ఇతర కార్పొరేట్ స్కూళ్లలో మరింత అధికంగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆ స్కూల్ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ భూములపై కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, దాదాపు 11 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఎంఎస్-7 జీవో ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు వేయాలనడం సరైన విధానం కాదని విమర్శించారు.

ఈ విధానం వల్ల తల్లిదండ్రులు పోరాటం చేసే అవకాశమే ఉండదని, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.

సమగ్ర పోరాటానికి పిలుపు

ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటిగా రావాలని కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని సూచించారు.

తమ పార్టీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేస్తుందని, ఇచ్చిన మాట తప్పబోమని ఆమె స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలో ఫీజుల నియంత్రణకు శాశ్వత అథారిటీ ఏర్పాటు చేయాలని లేదా గుజరాత్ మోడల్‌ను అనుసరించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలతో ఏర్పడిందని, ఆ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగేలా పాలన సాగాలని ఆమె పేర్కొన్నారు. విద్య, వైద్యం రంగాల్లో సమానత్వం, పారదర్శకత ఉండాలని కోరారు.