Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 10:42 am Posted by : VARTHA SANDHYA DESK

ఉద్యమకారులకు భూములివ్వాలి.. జులై 2న ఉప్పల్‌లో భూపోరాటం: కల్వకుంట్ల కవిత

  • బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో భూపోరాటం పోస్టర్ ఆవిష్కరణ
  • ఉద్యమకారులకు 250 గజాల భూమి హామీ అమలు చేయాలని డిమాండ్
  • ఉప్పల్ భగాయత్ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక
  • తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీయాలనే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు

యువత, మహిళలు భారీగా పాల్గొనాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, జులై 2న ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో భారీ స్థాయిలో భూపోరాటం నిర్వహించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు.

ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే అర్హులైన ఉద్యమకారులను గుర్తించి వారికి భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణవాదంపై మరోసారి కొందరు వ్యక్తులు, శక్తులు దాడి చేస్తున్నాయని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి కుట్రలను ప్రజల ఐక్యతతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

జులై 2న జరిగే భూపోరాటాన్ని విజయవంతం చేయడం ప్రతి తెలంగాణవాది చారిత్రక బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యమకారులకు న్యాయం జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. నేటి తరం భవిష్యత్తు కోసం తెలంగాణ ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేశారని, అలాంటి ఉద్యమకారుల హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కవిత విజ్ఞప్తి చేశారు.