Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 2:23 pm Posted by : VARTHA SANDHYA DESK

ఎల్‌బీ స్టేడియంలోని కనకదుర్గ ఆలయంలో నూతన మూలవిరాట్ పునఃప్రతిష్ఠా మహోత్సవం ప్రారంభం

హంపి విద్యారణ్య భారతీ స్వామివారి కరకమలములచే ప్రారంభమైన వైభవోపేత కార్యక్రమాలు

జూలై 12న రోహిణి నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో అమ్మవారి మూలవిరాట్ ప్రతిష్ఠ

 

హైదరాబాద్, జూలై 10 (వార్త సంధ్య): హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియం ప్రాంగణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవాలయంలో నూతన మూలవిరాట్ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

పరమపూజ్య శ్రీశ్రీశ్రీ హంపి విద్యారణ్య భారతీ స్వామివారి కరకమలములచే మహోత్సవాలను ప్రారంభించగా, వేదాంతం రాజనర్సింహాచార్యులు (రాజు పంతులు) వేదోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర నిజ జ్యేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఈ మహోత్సవాలు జూలై 12వ తేదీ ఆదివారం వరకు కొనసాగనున్నాయి. తొలి రోజు గురువందనం, స్వస్తివాచనం, గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, రక్షాబంధనం, అంకురారోపణ, యాగశాల ప్రవేశం, షోడశ స్తంభ పూజ, అఖండ దీపారాధన, వాస్తు పూజలు, నవగ్రహ పూజలు, ప్రధాన కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను వైదిక పండితులు నిర్వహించారు.

అనంతరం స్థాపిత దేవతా హవనాలు, మూలమంత్ర జపాలు, మూలమంత్ర హోమాలు, ప్రతిమా శోధనం, శతఔషధ యుక్త ప్రతిమ శోధన, శతఔషధ జలాధివాసం కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

శనివారం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, సర్వతోభద్ర మండప పూజలు, మూలమంత్ర హోమాలు, సప్తధాన్యాధివాసం, సామూహిక కుంకుమార్చనలు, ఫలపుష్ప శయ్యాధివాసం వంటి విశిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మహోత్సవాల ముగింపు రోజైన ఆదివారం ఉదయం 7.45 గంటలకు రోహిణి నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన మూలవిరాట్ ప్రతిష్ఠా కార్యక్రమం శ్రీశ్రీశ్రీ హంపి విద్యారణ్య భారతీ స్వామివారి కరకమలములచే నిర్వహించబడనుంది. అనంతరం కళాన్యాసం, చండీయాగం, నేత్రోన్మీలనం, విశ్వరూప దర్శనం, మహాపూర్ణాహుతి, అవబృథం, ఋత్విక్ సన్మానం, మహా ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటలకు బోనాల సమర్పణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. టీపీసీసీ మీడియా సెక్రటరీ మామిడి గోపి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్‌లు, గ్రౌండ్ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా నవశక్తి క్రీడా మండలి ప్రతినిధులు ఎం. మహేందర్ రెడ్డి, ఎన్. సత్యనారాయణ, పి. సత్యనారాయణ (ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు), బి. శ్రవణ్ కుమార్ (అంతర్జాతీయ క్రీడాకారుడు), డి. అనిల్ కుమార్, ఇంటర్నేషనల్ రిఫరీ కన్వీనర్ ఎం. నర్సింగ్ రావు, జూనియర్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ ఎం. రాజు, ఖేలో ఇండియా కోచ్ నిరక్షన్ రెడ్డి, నవశక్తి క్రీడాకారులు, గ్రౌండ్‌మ్యాన్ ఇన్‌చార్జ్ గౌరీశంకర్ (పోస్టల్ డిపార్ట్‌మెంట్), వేదాంతం రాజనర్సింహాచార్యులు తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ పునఃప్రతిష్ఠాపన కమిటీ సభ్యులు కోరారు.