- డ్రగ్స్ నియంత్రణకు ఏఐ, డేటా అనలిటిక్స్ వినియోగించాలి
- అంతర్జాతీయ స్థాయి నిఘా వ్యవస్థల అమలుకు చర్యలు
- డ్రగ్స్ ముఠాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని ఆదేశం
- ఎక్సైజ్ శాఖ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కీలక విభాగమని వ్యాఖ్య
- దిక్షాంత్ పరేడ్‌లో పాల్గొన 117 మంది యువ అధికారులు
రంగారెడ్డి జిల్లా బ్యూరో , జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు.
బండ్లగూడ జాగీర్‌లోని తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో గురువారం నిర్వహించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల దిక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆరు నెలల కఠోర శిక్షణను పూర్తి చేసుకున్న 28 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు కలిపి మొత్తం 117 మంది అధికారులు దిక్షాంత్ పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో 33 మంది మహిళా అధికారులు ఉన్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు మంత్రి పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎక్సైజ్ శాఖ కేవలం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విభాగం మాత్రమే కాదని, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడే సామాజిక బాధ్యత కలిగిన శాఖ అని పేర్కొన్నారు. ఒకప్పుడు నాటుసారా, గుడుంబా, కల్తీ మద్యం ప్రధాన సవాళ్లుగా ఉండేవని, ప్రస్తుతం గంజాయి, సింథటిక్ డ్రగ్స్, ఆన్‌లైన్ నార్కోటిక్ నెట్‌వర్క్‌లు కొత్త సవాళ్లుగా మారాయని చెప్పారు.
సాంకేతికతే అతిపెద్ద ఆయుధం
నేటి నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా సాంకేతికంగా మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక నిఘా వ్యవస్థలను వినియోగించాలని పేర్కొన్నారు.
డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా గంజాయి సాగు ప్రాంతాలు, అక్రమ సారా కేంద్రాలను గుర్తించడం, జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా రవాణాను పర్యవేక్షించడం, సోషల్ మీడియా ఇంటెలిజెన్స్ ద్వారా డ్రగ్ నెట్‌వర్క్‌లను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందని వివరించారు. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిఘా వ్యవస్థలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
డ్రగ్స్‌పై నిర్దాక్షిణ్య పోరు
రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. గంజాయి, మద్యం అక్రమ రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమార్కులు ఎంతటి ప్రభావశీలులైనా చట్టం ముందు మోకరిల్లేలా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
సౌమ్య త్యాగం స్ఫూర్తిదాయకం
క్రమశిక్షణ, నిజాయితీ, పారదర్శకత, ప్రజాసేవా దృక్పథమే అధికారుల అసలు గుర్తింపుగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నిజామాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ప్రాణత్యాగం చేసిన సౌమ్య ధైర్యసాహసాలు కొత్త అధికారులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఖురేషీ, సురేష్, అంజన్‌రావు, శశిధర్ రెడ్డి, రంగారెడ్డి తదితర ఉన్నతాధికారులు, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.