Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 8:59 pm Posted by : జడల నాగప్రసాద్

రేపు ఫోన్లలో సైరన్ శబ్దం… భయపడొద్దని కేంద్రం స్పష్టం

  • మే 2న దేశవ్యాప్తంగా అలర్ట్ టెస్ట్
  • ‘సాచెట్’ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పరిశీలన
  • ప్రజలకు ముందస్తు సమాచారం చేరవేయడమే లక్ష్యం

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 01 (వార్త సంధ్య) : మే 2న దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దంతో కూడిన అలర్ట్ మెసేజ్ రావచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది కేవలం పరీక్ష మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయం లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

భవిష్యత్తులో వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడానికి ‘సాచెట్’ (SACHET) అనే అత్యవసర హెచ్చరిక వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నాయి.

ఈ టెస్ట్ సమయంలో మొబైల్ ఫోన్లకు ప్రత్యేక అలర్ట్ మెసేజ్‌తో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేసే టెక్నాలజీ. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సుల మేరకు ఈ వ్యవస్థను దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.

లాభాలు ఇవే:

ప్రమాద సూచనలు ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సమాచారం చేరుతుంది. వరదలు, తుఫానులు వంటి విపత్తుల ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చు. అలాగే ప్రమాద ప్రాంతాల్లో ఉన్న మొబైల్ ఫోన్లకే ఈ అలర్ట్‌లు చేరేలా ప్రత్యేకంగా రూపొందించారు.

ప్రజలు ఈ అలర్ట్‌ను కేవలం పరీక్షగా భావించి, భయపడకుండా సహకరించాలని కేంద్రం కోరింది.