Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 4:50 pm Posted by : VARTHA SANDHYA DESK

2 ప్లస్ పర్మిషన్… 5 ప్లస్ నిర్మాణం…

  • సికింద్రాబాద్ పరిసరాల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు..
  • సీతాఫల్మండి ఫ్లైఓవర్ పక్కన భారీ అక్రమ నిర్మాణం
  • నోటీసులు ఇచ్చి కూల్చివేతలు ఎందుకు లేవు..?
  • లంచాల ఆరోపణలతో టౌన్ ప్లానింగై పై తీవ్ర విమర్శలు
  • చైన్మెన్ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
  • డిప్యూటీ కమిషనర్ జోక్యం కోరుతున్న ప్రజలు

 

సికింద్రాబాద్, వార్త సంధ్య:

సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సీతాఫల్మండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రధాన రహదారి పక్కన, పిసలోకర్ కాలనీలో (పక్కింటి నెం.12-10-48 సమీపంలో) భారీ అక్రమ నిర్మాణం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్మిషన్ తీసుకున్నది జి ప్లస్ టు కానీ నిర్మాణం చేపడుతున్నది జి ప్లస్ ఫైవ్. నిత్యం వాహన రద్దీతో కిటకిటలాడే ప్రధాన రహదారి పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం సాగుతుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

నోటీసులే కానీ చర్యలే లేవా..?

ఈ నిర్మాణం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, తదుపరి చర్యలు తీసుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. కూల్చివేతలు జరగకపోవడం వెనుక లంచాల వ్యవహారం ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

టౌన్ ప్లానింగ్ లో అవినీతి ఆరోపణలు

అనుమతులు లేకుండా భారీ నిర్మాణం కొనసాగుతుండటం టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొందరు అధికారులు భారీగా లంచాలు తీసుకుని కళ్లు మూసుకున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన శాఖే మౌనంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ప్రజలు అంటున్నారు.

 

చైన్మెన్ బాధ్యత ఎక్కడ..?

ప్రాథమికంగా అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన చైన్మెన్ తన విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారని స్థానికులు మండిపడుతున్నారు. ఇంత భారీ నిర్మాణం కొనసాగుతున్నా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో చైన్మెన్ పాత్రపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఉన్నతాధికారుల జోక్యం అవసరం

ఇప్పటికైనా సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్పందించి అక్రమ నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే సికింద్రాబాద్ సర్కిల్ మొత్తం అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.