Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 5:17 pm Posted by : VARTHA SANDHYA DESK

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నుంచి జాగ్రత్తలు తప్పనిసరి

మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని జిల్లా వైద్యాధికారి సూచన

పెద్దపల్లి, ఏప్రిల్ 25 (వార్త సంధ్య): పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ (హీట్ వేవ్) వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, మరణాలను నివారించేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సూచించారు.మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తలపై గుడ్డ లేదా టోపీ ధరించి, గొడుగు ఉపయోగించాలని తెలిపారు. తరచుగా నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలను తీసుకోవాలని సూచించారు. తేలికపాటి, పలుచని, లేత రంగు దుస్తులు ధరించడం మంచిదని పేర్కొన్నారు.పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎండలో ఎక్కువసేపు పని చేయకుండా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. బయట నిలిపిన వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని హెచ్చరించారు. మద్యం, అధిక కాఫీ, టీ వంటి పానీయాలను తగ్గించాలని చెప్పారు.

వడదెబ్బ లక్షణాలుగా అధిక జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట, చర్మం ఎర్రబడడం, చెమటలు ఆగిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు.జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో హీట్ స్ట్రోక్ చికిత్సకు అవసరమైన సౌకర్యాలు, ఓఆర్ఎస్, మందులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, చిన్న జాగ్రత్తలతోనే వడదెబ్బ ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు.