Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 1:35 pm Posted by : VARTHA SANDHYA DESK

RTI సమాచారం ఇవ్వనందుకు హయత్నగర్ MEO శ్రీనివాస్‌కు రూ.5,000 జరిమానా

RTI కార్యకర్త, అడ్వకేట్ మహేశ్ బాబు చోల్లేటి ఫిర్యాదుపై రాష్ట్ర సమాచార కమిషన్ చర్య

హైదరాబాద్, జూలై 5 (వార్త సంధ్య ): సమాచార హక్కు చట్టం (RTI Act) కింద కోరిన సమాచారాన్ని నిర్దేశిత గడువులో అందించడంలో విఫలమైనందుకు హయత్నగర్ మండల విద్యాశాఖ అధికారి (MEO) శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ రూ.5,000 జరిమానా విధించింది.

RTI కార్యకర్త, అడ్వకేట్ మహేశ్ బాబు చోల్లేటి దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్, సంబంధిత అధికారి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. దీంతో రూ.5,000 జరిమానా విధిస్తూ, వెంటనే ఫోన్‌పే ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు.కమిషనర్ ఆదేశాల మేరకు హయత్నగర్ MEO శ్రీనివాస్ అదే రోజు ఫోన్‌పే ద్వారా రూ.5,000 జరిమానా చెల్లించినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా RTI చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించడం ప్రభుత్వ అధికారుల చట్టబద్ధమైన బాధ్యత అని, నిర్లక్ష్యం లేదా జాప్యం జరిగితే సమాచార కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటన సమాచార హక్కు చట్టం అమలులో జవాబుదారీతనానికి మరో ఉదాహరణగా నిలిచిందని RTI కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.