- పోలీసు ఉద్యోగాల అభ్యర్థులతో మాజీ మంత్రి భేటీ
- రెండున్నరేళ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శ
- 5 వేల పోస్టుల నోటిఫికేషన్‌తో యువతకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం
- పాత వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్
- నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా
హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీశ్ రావు విమర్శించారు. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత హైదరాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించిన సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకేసారి 16 వేల, 17 వేల చొప్పున భారీ పోలీసు నియామక నోటిఫికేషన్లు విడుదల చేశామని, పోలీస్ శాఖలోనే దాదాపు 48 వేల పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 19 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం, డీజీపీ స్వయంగా చెబుతున్నప్పటికీ కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడం నిరుద్యోగులను వంచించడమేనని హరీశ్ రావు విమర్శించారు. వెంటనే మొత్తం 19 వేల ఖాళీల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేవలం 5 వేల పోస్టుల భర్తీతో గ్రామీణ ప్రాంత యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రిజర్వేషన్ల ప్రకారం అనేక వర్గాలకు అవకాశాలు తగ్గిపోతాయని, దీంతో గ్రామీణ అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు.
రెండున్నర సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విధంగానే కానిస్టేబుల్ పోస్టులకు 36 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పోలీసు నియామకాలలో ఈవెంట్స్ నిబంధనలను కఠినతరం చేయడం కూడా అన్యాయమని హరీశ్ రావు అన్నారు. గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని, లాంగ్ జంప్, షాట్‌పుట్ వంటి ఈవెంట్లలో పెంచిన ప్రమాణాలను పునఃసమీక్షించాలని కోరారు.
ఉద్యోగ దరఖాస్తులపై ఫీజులు ఉండవని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ఇప్పుడు వేల రూపాయలు వసూలు చేస్తూ నిరుద్యోగులపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అప్లికేషన్ ఫీజులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్ వంటి ప్రాంతాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ గ్రౌండ్లు అందుబాటులో లేవని, సమీపంలోని పోలీసు లేదా ఇతర ప్రభుత్వ మైదానాలను నిర్దిష్ట సమయాల్లో కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, 19 వేల పోలీసు పోస్టులతో పాటు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.