ప్రపంచంలో అగ్రగామి యూనివర్సిటీ విద్యార్థులతో ఇంగ్లీష్ బేసిక్ లో పోటీ పడగల సత్తా మా విద్యార్థులది:విద్యావేత్త కర్నాటి సురేంద్రబాబు
హైదరాబాద్, జూన్ 14 (వార్త సంధ్య):ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రాథమిక స్థాయి విద్యార్థులతో వినూత్న బోధనా విధానాన్ని అమలు చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించామని విద్యావేత్త కర్నాటి సురేంద్రబాబు తెలిపారు.సోమాజిగూడ లో ప్రెస్ క్లబ్ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా తెలంగాణలోని మూడు ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక ఇంగ్లీష్ బోధనా విధానాన్ని అమలు చేసి విశేష ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. తోలుతా విద్యార్థులచేత ఇంగ్లీష్ లో సెంటెన్స్ మాట్లాడించడం జరిగింది.
తమ పద్ధతిలో శిక్షణ పొందిన 9, 10 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు రెండుసార్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ప్రొఫెసర్లు, ఎం.ఏ. ఇంగ్లీష్ విద్యార్థులతో నేరుగా చర్చించారని, ఇది విశ్వవిద్యాలయ చరిత్రలో అరుదైన ఘట్టమని తెలిపారు. ఇంగ్లీష్ భాషలోని ప్రాథమిక అంశాలను ప్రపంచంలోని ఎవరితోనైనా పోటీ పడే స్థాయికి ప్రభుత్వ బడి పిల్లలు చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు నర్సరీ నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు ఉన్న పుస్తకాలలోని వాక్య నిర్మాణాలను సులభంగా గుర్తించగలరని, నాలుగు టెన్సులను ఆధారంగా చేసుకుని వందలాది వాక్య నిర్మాణాలను తప్పులేకుండా రూపొందించగలరని వివరించారు. అంతేకాకుండా పార్ట్స్ అఫ్ స్పీచ్ , ఆక్టివ్-పాసివ్ వాయిస్ , డైరెక్ట్-ఇండైరెక్ట్ స్పీచ్ , కండిషనల్ సెంటెన్సస్ వంటి క్లిష్టమైన అంశాలను కూడా విశ్లేషించే సామర్థ్యాన్ని విద్యార్థులు సంపాదించారని చెప్పారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థలో పాత బోధనా విధానాలు కొనసాగుతున్నాయని, పాఠ్యపుస్తకాలలోని అనవసర పునరావృత అంశాలను తొలగించి సరళమైన, సమర్థవంతమైన ఇంగ్లీష్ బోధనను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పరిశోధన ఆధారిత విధానంతో కేవలం 30 పని దినాల్లో ఉపాధ్యాయులకు పూర్తి శిక్షణ ఇవ్వవచ్చని, 100 పని దినాల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాథమిక అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల సంస్కరణ చేపట్టాలని, డీఈడ్, బీఈడ్ శిక్షణా విధానాల్లో మార్పులు తీసుకురావాలని, ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాలను “జీరో టు హీరో ఇంగ్లీష్ మోడల్ స్కూల్”గా అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే విద్యా విధాన రూపకల్పనలో నిపుణులకు ప్రాధాన్యం కల్పిస్తూ స్వయంప్రతిపత్తి గల విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
అరకొర వసతుల మధ్య ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ స్థాయి ప్రతిభను కనబరిచినప్పుడు, మెరుగైన వసతులు కల్పిస్తే మరింత గొప్ప ఫలితాలు సాధ్యమవుతాయని సురేంద్రబాబు అన్నారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు వస్తే 2027 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్‌లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.