Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 5:43 pm Posted by : VARTHA SANDHYA DESK

గోదావరి ఇసుకపై సీబీఐ దర్యాప్తు జరపాలి 

  • ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల నిధులు విడుదల చేయాలి
  • పీసా, 1/70 చట్టాల అమలులో వైఫల్యంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
  • మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, చందా లింగయ్య దొర డిమాండ్

హైదరాబాద్, జూన్ 6 (వార్త సంధ్య): భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గోదావరి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు (ఐపీఎస్, విరమణ), అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ చందా లింగయ్య దొర డిమాండ్ చేశారు. గోదావరి ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో “సిల్ట్ తొలగింపు” పేరుతో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. భద్రాచలం, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో ఆదివాసీ ఇసుక సొసైటీల పేరుతో ఇసుకను విక్రయిస్తున్నప్పటికీ, స్థానిక ఆదివాసీ గ్రామాలకు తగిన ప్రయోజనాలు అందడం లేదని విమర్శించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 74, ములుగు జిల్లాలో 40 కలిపి మొత్తం 114 ఆదివాసీ ఇసుక సొసైటీలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రోజుకు సుమారు 5.7 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వి, క్యూబిక్ మీటర్‌కు సగటున రూ.1,800 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ లెక్కన 2014 నుంచి 2026 వరకు గోదావరి ఇసుక తవ్వకాల ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరి ఉండవచ్చని అంచనా వేశారు.

ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం, ఖర్చులు, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై స్వతంత్ర ఆర్థిక ఆడిట్ నిర్వహించాలని కోరారు.

పీసా చట్టం-1996, 1/70 భూమి బదలాయింపు నియంత్రణ చట్టం, అటవీ హక్కుల చట్టాల అమలులో తీవ్ర లోపాలు ఉన్నాయని ఆరోపించారు. గ్రామసభల అనుమతి లేకుండా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

 

 

*షెడ్యూల్డ్ ప్రాంతాల రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్*

 

షెడ్యూల్డ్ ప్రాంతాల రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ ప్రత్యేక జోక్యం చేసుకుని ఆదివాసీ ప్రాంతాల పాలన, సహజ వనరుల వినియోగం, భూముల పరాయీకరణ అంశాలను సమీక్షించాలని కోరారు. గోదావరి ఇసుక తవ్వకాల వ్యవహారం, పీసా చట్టం అమలు, ఆదివాసీ ప్రాంతాల ఆదాయ వినియోగంపై సీబీఐ లేదా హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా ఆదివాసుల భూములు, భాషలు, సంస్కృతి, మత విశ్వాసాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన వారు, ఆదివాసుల స్వయం పాలన, అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కోయ భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, 2027 జనగణనలో ఆదివాసీ మతానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గ్రామసభల పర్యవేక్షణలో ఖర్చు చేయాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని కోరారు. త్వరలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో బీసీ టైమ్స్ ఎడిటర్ సంగెం సూర్యారావు, జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు–సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి రామనాల లక్ష్మయ్య, రాష్ట్ర కన్వీనర్లు పాయం సత్యనారాయణ, మడావి నరసింహారావు, రాష్ట్ర కో-కన్వీనర్లు వజ్జా నర్సింహారావు, లోకిని రాజు, సంజీవ్ సడిమెక తదితరులు పాల్గొన్నారు.