Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 9:03 pm Posted by : VARTHA SANDHYA DESK

వనస్థలిపురంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా

  • విద్యార్థుల ప్రతిభను వెలికితీసిన సాంస్కృతిక కార్యక్రమాలు

  • ప్రముఖుల సమక్షంలో బహుమతుల ప్రదానం

  • “విద్యతో పాటు సంస్కృతి కూడా అవసరం” – అతిథుల సందేశం


హయత్‌నగర్ ప్రతినిధి, వార్త సంధ్య – మార్చి 15: వనస్థలిపురంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవ వేడుకలు–2026 “క్విన్టెసెన్స్” పేరుతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారి కలలకు నూతన దిశనిచ్చే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు నేలపాటి రామారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా బైరిడ్డి శ్రీను (మిట్టీ కాలేజ్ చైర్మన్), డి.భీక్షపతి (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ – సెంట్రల్ క్రైమ్ స్టేషన్), జి.వెంకటేశ్వర్ రెడ్డి (ఏసీపీ – సీసీఎస్), దీపావళి శ్రవణ్, దీపావళి శ్రీకాంత్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అలాగే ఏసీపీ ఉదం సింగ్ మూవీ టీమ్‌కు చెందిన హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతలు పాల్గొని సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసి విద్యార్థుల ఆటపాటలను కొనియాడారు.ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. విద్యా మరియు క్రీడా రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ వెంకట శ్రవణ్ మరియు వారి సతీమణి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.