యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు


పార్వతీపురం మన్యం, జూన్ 24 (వార్త సంద్య ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని డాన్ బోస్కో స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టెక్నికల్ అసిస్టెంట్ గంటా రామకృష్ణ విశేష ప్రతిభ కనబరిచారు.సీనియర్ వ్యాసరచన విభాగంలో “ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా” అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొన్న పోటీదారులను అధిగమించి ప్రథమ స్థానం సాధించారు. అలాగే యోగా స్లోగన్ విభాగంలో ద్వితీయ స్థానం దక్కించుకుని రెండు విభాగాల్లోనూ ప్రతిభ చాటారు.
“యోగాను ప్రేమిద్దాం – ఒత్తిడిని జయిద్దాం”, “యోగా ఉంటే మన చెంత – ఆరోగ్యానికి నిశ్చింత” వంటి ఆకర్షణీయమైన స్లోగన్లతో న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు.
వీరఘట్టం మండలంలో వి.బి.జి.ఆర్.జి టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గంటా రామకృష్ణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేతుల మీదుగా మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు.ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో కూడా ఆయన సాహిత్య ప్రతిభకు ఘన సత్కారం లభించింది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే సాహిత్యం, యోగా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందుతున్నారు.అలాగే యోగాంధ్ర మన్యం జిల్లా యోగా పోటీలలో న్యాయనిర్ణేతగా కూడా సేవలందించారు. రాష్ట్ర స్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లాకు గుర్తింపు తీసుకురావడం పట్ల యోగా దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ,జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు, పలువురు అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.