- రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన కలుపు మందు
- వ్యవసాయ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ
హైదరాబాద్ సిటీ ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య): కలుపు నివారణ కోసం ఉపయోగించే గడ్డి మందు వల్ల తెలంగాణలో రోజూ రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మందును తక్షణమే నిషేధించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి. గోపిని కలిసి కేఎస్ఆర్ గౌడ వినతిపత్రం అందజేశారు. గడ్డి మందు నిషేధంతో పాటు వ్యవసాయ మందుల దుకాణాల్లో వాటి విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలతో మనస్థాపానికి గురైన రైతులు ఆవేశంలో గడ్డి మందు తాగడం వల్ల వెంటనే మరణిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా అనేక రైతు కుటుంబాలు ఆర్థిక, సామాజికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా గడ్డి మందు వల్ల భూమి కూడా విషతుల్యమవుతోందని, దీని వినియోగం వ్యవసాయానికి దీర్ఘకాలంలో హానికరమని అన్నారు. అందువల్ల గడ్డి మందును పూర్తిగా నిషేధించి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గడ్డి మందు నిషేధానికి చర్యలు తీసుకుంటామని, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. తమ పరిధిలో ఒక నెలపాటు తాత్కాలిక నిషేధానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మండల వ్యవసాయ అధికారి ప్రిస్క్రిప్షన్ ఆధారంగా గడ్డి మందు విక్రయం కూడా సరికాదని, పూర్తిస్థాయి నిషేధం అవసరమని కేఎస్ఆర్ గౌడ స్పష్టం చేశారు.