Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:06 pm Posted by : జడల నాగప్రసాద్

అటవీ శాఖలో అవినీతి బాగోతం బట్టబయలు

  • చెట్లు దెబ్బతిన్న కేసు మాఫీకి రూ.10 లక్షల డిమాండ్..!
  • ఎఫ్‌డీఓ సుజాత – డీఆర్‌ఓ కృష్ణయ్యల అవినీతి దందా
  • ప్రజలను భయపెట్టి డబ్బుల వసూళ్లు
  • అటవీ శాఖ అధికారుల అసలు రంగు బయటపడింది

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 07 (వార్త సంధ్య): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రోడ్డు నిర్మాణ పనుల సమయంలో చెట్లు దెబ్బతిన్న ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అటవీ శాఖ అధికారులు ఏసీబీ వలలో చిక్కడం జిల్లాలో సంచలనం సృష్టించింది.

భద్రాచలం అటవీ శాఖ ఎఫ్‌డీఓ సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్‌ఓ కృష్ణయ్యలు కలిసి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. గురువారం భద్రాచలం అటవీ శాఖ కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

సమాచారం ప్రకారం, చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కొన్ని చెట్లు పొరపాటున దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని బెదిరించి, కేసు మాఫీ పేరుతో సంబంధిత వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎఫ్‌డీఓ సుజాత ప్రధాన పాత్ర పోషించగా, డీఆర్‌ఓ కృష్ణయ్య కూడా భాగస్వామిగా వ్యవహరించినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించింది.

దాడి సమయంలో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు మరియు ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదే జిల్లాలో గతంలో కూడా అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన జిల్లా స్థాయి అధికారి రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన మరువకముందే మరో అవినీతి వ్యవహారం బయటపడటం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. వరుస ఘటనలతో అటవీ శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.