శాస్త్రీయ ఆధారాలు లేని ఆరోగ్య వాదనలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి?
— చార్వాక
SCIENTIFIC STUDY FORUM (SSF)
మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించే చేప ప్రసాదం కార్యక్రమం మరోసారి సిద్ధమయింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే ఈ సందర్భంగా సమాజం, ప్రభుత్వం, వైద్య రంగం మరియు పౌర సమాజం ముందు ఒక ప్రాథమిక ప్రశ్న ఉంది. చేప ప్రసాదం పేరుతో ఆస్తమా వంటి వ్యాధులను నయం చేస్తుందని ప్రచారం చేస్తున్న ఈ కార్యక్రమానికి శాస్త్రీయ ఆధారాలు ఏమిటి?
హైదరాబాద్‌కు చెందిన బత్తిని కుటుంబం దశాబ్దాలుగా ఒక ప్రత్యేక మూలికా మిశ్రమాన్ని చిన్న చేపలో పెట్టి ఆ చేపను మింగిస్తే ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని చెబుతోంది. గతంలో దీనిని బహిరంగంగానే “చేప మందు”గా ప్రచారం చేశారు. అయితే వివిధ హేతువాద సంస్థలు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఈ వాదనలను ప్రశ్నించడంతో పాటు న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం “మందు” అనే పదం స్థానంలో “ప్రసాదం” అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభమైంది. కేవలం పేరు మాత్రమే మార్చి వారు చేస్తున్న పంపిణీ మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు.
అయితే ఇక్కడ కొన్ని సహజమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది నిజంగా ప్రసాదమే అయితే వ్యాధులు నయమవుతాయని ఎందుకు చెబుతున్నారు? ఇది నిజంగా ఔషధమే అయితే శాస్త్రీయ పరీక్షలకు ఎందుకు సమర్పించడం లేదు? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం సమాజానికి అందలేదు. నిర్వాహకులు సైతం దీనిపైన స్పందించలేదు.
ఏదైనా పదార్థం ఒక వ్యాధికి చికిత్సగా పనిచేస్తుందని చెప్పాలంటే కొన్ని కనీస శాస్త్రీయ ప్రమాణాలు ఉండాలి. ఆ పదార్థంలోని రసాయనిక లేదా ఔషధ గుణాలు ఏమిటో తెలియాలి. ఆ మందు ప్రభావాన్ని నిరూపించే క్లినికల్ ట్రయల్స్ జరగాలి. ఆ పరిశోధనలను ఇతర శాస్త్రవేత్తలు సమీక్షించి ఆమోదించాలి. దుష్ప్రభావాలు ఏమిటో వెల్లడించాలి. ఇవన్నీ ఆధునిక వైద్య శాస్త్రంలో సాధారణ ప్రక్రియలు. కానీ చేప ప్రసాదం విషయంలో ప్రపంచ వైద్య సమాజం అంగీకరించిన ప్రమాణాలకు అనుగుణంగా జరిగిన పరిశోధనలు ప్రజల ముందుకు రాలేదు. ఆస్తమా వ్యాధిని ఇది నయం చేస్తుందని నిరూపించే విశ్వసనీయ శాస్త్రీయ ఆధారాలు కూడా అందుబాటులో లేవు.
ఈ సందర్భంగా తరచుగా వినిపించే వాదన ఏమిటంటే, “ఇంతమంది ప్రజలు ఉపయోగిస్తున్నప్పుడు ఏదో ప్రయోజనం ఉండి ఉండాలి కదా?” అనేది. ఇది వినడానికి సహజంగా అనిపించినా, శాస్త్రీయంగా సరైన నిర్ధారణ కాదు. చరిత్రలో అనేక అపోహలు, మూఢనమ్మకాలు, అద్భుత చికిత్సల వాదనలు ప్రజల వ్యక్తిగత అనుభవాల ఆధారంగానే వ్యాపించాయి. ఒక వ్యక్తికి ఏదో కారణం వల్ల ఆరోగ్యం మెరుగుపడితే, అది తీసుకున్న పదార్థం వల్లనే జరిగిందని భావించడం సాధారణం. కొన్నిసార్లు వ్యాధి సహజంగానే తగ్గవచ్చు. ఎందుకంటే సహజంగానే మనకి రోగ నిరోధక శక్తి ఉంటుంది. కొన్నిసార్లు వ్యక్తి ఇతర మందులు కూడా వాడుతూ ఉండవచ్చు. కొన్నిసార్లు లక్షణాలు తాత్కాలికంగా తగ్గి ఉండవచ్చు. అందుకని వ్యక్తిగత అనుభవాలను కాకుండా నియంత్రిత శాస్త్రీయ పరిశోధనలను ఆధారంగా తీసుకుంటారు.
ఆస్తమా అనేది సాధారణ జలుబు కాదు. ఇది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి ఆధునిక వైద్యంలో శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇన్హేలర్లు, బ్రోంకోడైలేటర్లు, స్టెరాయిడ్ చికిత్సలు మరియు వైద్య పర్యవేక్షణ వంటి అనేక పద్ధతులు లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో శాస్త్రీయంగా నిరూపితం కాని పద్ధతులను ప్రజలకు ప్రత్యామ్నాయంగా చూపించడం ప్రజారోగ్యానికి సంబంధించిన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ఇక్కడ ప్రధాన ప్రశ్న బత్తిని కుటుంబం గురించి మాత్రమే కాదు. ప్రభుత్వ పాత్ర గురించి కూడా. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం కోసం భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు, రవాణా సదుపాయాలు, వైద్య శిబిరాలు మరియు ఇతర ప్రభుత్వ వనరులు వినియోగించబడుతున్నాయి. ప్రజల పన్నుల ద్వారా నడిచే ప్రభుత్వ వ్యవస్థ ఒక ఆరోగ్య వాదనకు సహకరిస్తున్నప్పుడు, ఆ వాదన శాస్త్రీయంగా నిరూపితమై ఉండాలి. లేకపోతే అదే ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది.
ఒకవైపు ప్రభుత్వం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని చెబుతుంది. మరోవైపు శాస్త్రీయంగా నిరూపితం కాని ఆరోగ్య వాదనలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తుంది. ఈ వైరుధ్యాన్ని సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
భారత రాజ్యాంగం Article 51A(h) ప్రకారం ప్రతి భారత పౌరుడి ప్రాథమిక విధుల్లో ఒకటి “శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, పరిశోధనా స్ఫూర్తి మరియు సంస్కరణాభిలాషను పెంపొందించడం” అని స్పష్టంగా పేర్కొంది. ఇది కేవలం పౌరుల బాధ్యత మాత్రమే కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత కూడా… ప్రభుత్వ విధానాలు మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. శాస్త్రీయంగా నిరూపితం కాని ఆరోగ్య వాదనలకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం Article 51A(h) యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా కనిపిస్తుంది.
శాస్త్రీయ అధ్యయన వేదిక (SCIENTIFIC STUDY FORUM) (SSF) అభిప్రాయం ప్రకారం, చేప ప్రసాదం పేరిట జరుగుతున్న ఆరోగ్య సంబంధిత వాదనలను స్వతంత్ర వైద్య మరియు శాస్త్రీయ నిపుణులతో పరిశీలించాలి. ఈ వాదనలకు ఆధారాలుంటే అవి ప్రజల ముందుకు తీసుకురావాలి. నిజంగా ఆస్తమా చికిత్సలో ఇది ప్రభావవంతమైనదైతే, ప్రపంచ వైద్య శాస్త్రం ముందు నిరూపించాలి. లేకపోతే ప్రజల ఆరోగ్యంతో సంబంధం ఉన్న వాదనలను ప్రచారం చేయడం నిలిపివేయాలి.
చేప ప్రసాదంలో ఉపయోగిస్తున్న పదార్థాలు, వాటి ఔషధ గుణాలు, దుష్ప్రభావాలు, ప్రభావిత్వానికి సంబంధించిన వివరాలను ప్రజలకు వెల్లడించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) వంటి సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. ప్రజారోగ్యానికి సంబంధించిన ఏ చికిత్స అయినా శాస్త్రీయ ఆధారాలు, పరిశోధనలు, క్లినికల్ నిర్ధారణల ఆధారంగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అందుకు భిన్నంగా ఉన్న ఎటువంటి పద్ధతినైనా ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి.
ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తించాలి. శాస్త్రీయంగా నిరూపితం కాని ఆరోగ్య వాదనలకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా వనరులు, ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన డబ్బును వినియోగించడాన్ని పునఃపరిశీలించాలి. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. మూఢనమ్మకాలు, అద్భుత వైద్య వాదనలు, ఆశాస్త్రీయమైన మరియు నిరూపితం కాని ఆరోగ్య ప్రచారాలను వెంటనే నిలిపివేయాలి.
మా పోరాటం ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదు. ఏ కుటుంబానికి వ్యతిరేకంగా కాదు. ఏ మతానికి లేదా సంప్రదాయానికి వ్యతిరేకంగా కూడా కాదు. మా పోరాటం అశాస్త్రీయ వాదనలకు వ్యతిరేకంగా. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రతి వాదన కూడా శాస్త్రీయ పరీక్షను ఎదుర్కోవాలి. శాస్త్రం ముందు ప్రతి వాదన సమానమే. నిరూపితమైతే అంగీకరిద్దాం. నిరూపితం కాకపోతే ప్రశ్నిద్దాం. అదే శాస్త్రీయ దృక్పథం.
విశ్వాసం వ్యక్తిగత విషయం కావచ్చు. కానీ ఆరోగ్యం, వైద్యం, ప్రజారోగ్య విధానాలు శాస్త్రీయ ఆధారాలపైనే నిలబడాలి. శాస్త్రీయ దృక్పథం రాజ్యాంగ విధి. అశాస్త్రీయ ప్రచారం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
- విశ్వాసం కాదు — శాస్త్రీయ ఆధారాలే ప్రమాణం!
- ప్రసాదం కాదు — ప్రజలకు శాస్త్రీయ వైద్యం కావాలి!
- నిరూపించండి లేదా ప్రచారం నిలిపివేయండి!
- మూఢనమ్మకాలను నిర్మూలిద్దాం — శాస్త్రీయ సమ సమాజాన్ని నిర్మిద్దాం!

చార్వాక
ఫౌండర్ & ప్రెసిడెంట్
శాస్త్రీయ అధ్యయన వేదిక
(SCIENTIFIC STUDY FORUM – SSF)
9347284111.