- వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచన
- ఖర్జూర సాగుపై అవగాహన, శిక్షణ అవసరమని అభిప్రాయం
- బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి
- ఖర్జూర పండ్లలో అధిక పోషక విలువలు ఉన్నాయని నిపుణుల వ్యాఖ్య

హైదరాబాద్ సిటీ ప్రతినిధి , జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణలో ఖర్జూర పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఖర్జూర సాగు చేసే రైతులకు సబ్సిడీలు, బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని స్పీక్ సంస్థ సలహాదారు ఏ. సత్యనారాయణ కోరారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు వాణిజ్య పంటల సాగుపై ఆసక్తి చూపాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణ రైతులు ఖర్జూర పంట సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా స్పీక్ సంస్థ అధ్యక్షుడు గోపాలం విద్యాసాగర్ మాట్లాడుతూ, ఖర్జూర సాగుపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.
ఖర్జూర పండ్లలో సహజసిద్ధమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, వీటి ఉత్పత్తిలో రసాయన స్ప్రేల వినియోగం చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే ఖర్జూర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు.
పండ్లను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, అన్ని వయసుల వారు పండ్లను తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. వ్యక్తుల క్యాలరీ అవసరాలకు అనుగుణంగా పోషక విలువలు మారుతాయని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు, రైతులు, స్పీక్ సంస్థ ప్రతినిధులు పాల్గొని ఖర్జూర సాగు అవకాశాలు, రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.