బీజేపీ–బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే నామినేషన్ రద్దయిందని ఆరోపణ
రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతల స్పష్టం
హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య హక్కులపై బీజేపీ చేస్తున్న దాడిగా ప్రభుత్వ విప్ డా. బల్మూర్ వెంకట్ ఆరోపించారు.
మీనాక్షి నటరాజన్‌కు సంఘీభావంగా గాంధీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడిన ఆయన, బీజేపీ మరియు బీఆర్ఎస్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ వ్యవహారం జరిగిందని విమర్శించారు. మూడో అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోయినా, ఉద్దేశపూర్వకంగా అభ్యర్థిని నిలబెట్టి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించేలా కుట్ర పన్నారని ఆరోపించారు.
ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం కాదని, దేశంలోని ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను కాలరాసే చర్యగా భావించాలని అన్నారు. మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జిగా రాకముందే నమోదైన కేసులో ఆమె పేరును ఎలా చేర్చారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఓటు చోరీతో పాటు ఇప్పుడు సీటు చోరీ రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయని విమర్శించిన బల్మూర్ వెంకట్, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక ఎన్నికల వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా లేకపోతే ప్రజాస్వామ్య సంస్థలను కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు.
గాంధేయ సిద్ధాంతాలను ఆచరిస్తున్న మీనాక్షి నటరాజన్‌పై కుట్ర చేయడం అంటే మహాత్మా గాంధీ ఆలోచనలను అవమానించడం వంటిదేనని అన్నారు. ప్రైవేట్ కేసును సాకుగా చూపి నామినేషన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాటం కొనసాగిస్తుందని బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు.