- రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లకు ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో అవకాశం కల్పించాలి:
- ఖాళీల భర్తీ, అదనపు విధుల రద్దు,
- మేనిఫెస్టో హామీ మేరకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్
హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లకు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి డిమాండ్ చేశారు. ఖైరతాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
అంగన్వాడీ టీచర్లలో చాలామంది డిగ్రీ, పీజీ, బీఈడ్ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారని పేర్కొన్న ఆమె, వారికి తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లను ప్రాథమిక ఉపాధ్యాయులుగా నియమించాలని కోరారు.
అంగన్వాడీ ఉద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి పనిచేసినా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తమ పిల్లలు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు వారికి కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
గత రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లే అంగన్వాడీ ఉద్యోగులకు కూడా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని కోరారు.
అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన 12 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయడంతో పాటు కేంద్రాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదనపు విధుల పేరుతో బీఎల్‌వో డ్యూటీలు, వివిధ రకాల సర్వేలు నిర్వహించే బాధ్యతలను అంగన్వాడీ సిబ్బందిపై మోపడం సరికాదని పేర్కొన్నారు. వారిని అంగన్వాడీ సేవలకు సంబంధించిన పనులకే పరిమితం చేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, లక్ష్మీ కవిత శ్రీలత మల్లికా సుజాత శోభ తదితర అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.