రంగారెడ్డి విద్యాశాఖలో అక్రమాలపై సమగ్ర విచారణ కోరిన AIMIM రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ బాబు చొల్లేటి
హైదరాబాద్, జూలై 21 (వార్త సంధ్య): రంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు, రిపాట్రియేషన్లు, బదిలీల వ్యవహారంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై స్వతంత్రంగా, సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని AIMIM (ఇంక్విలాబ్-ఎ-మిల్లత్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ బాబు చొల్లేటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సమగ్ర ఫిర్యాదు సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులో A. నరేందర్ (SA) కు సంబంధించిన Director, School Education & State Project Director Proceedings No.2083/SS/T1/2021-1 (తేదీ: 15-09-2025), అలాగే DEO & Ex-Officio DPO, Samagra Shiksha, Rangareddy Proceedings No. N.P.No.233/S1/Co-ordinators/DPO/SS/RR/2025-26 (తేదీ: 09-04-2026) ప్రొసీడింగ్స్‌ను ప్రస్తావిస్తూ, వాటి చట్టబద్ధతపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉత్తర్వులు, అమల్లో ఉన్న నిబంధనలు, మినహాయింపులు (Exemptions), సడలింపులు (Relaxations) ఏ ప్రాతిపదికన వర్తింపజేశారో పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ఈ అంశంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD), హైదరాబాద్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అలాగే డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా అధికారికంగా ఫిర్యాదులు సమర్పించినట్లు వెల్లడించారు.
అలాగే, ప్రస్తుతం నల్గొండ జిల్లా డీఈఓగా విధులు నిర్వహిస్తున్న, గతంలో రంగారెడ్డి జిల్లా డీఈఓగా పనిచేసిన పి. సుశీందర్ రావు పదవీకాలంలో జరిగిన అన్ని ఉపాధ్యాయుల బదిలీలు, డిప్యుటేషన్లు, రిపాట్రియేషన్లు, నియామకాలు మరియు ఇతర పరిపాలనా నిర్ణయాలపై కూడా స్వతంత్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మహేష్ బాబు చొల్లేటి విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు సంబంధిత రికార్డులన్నింటినీ బహిర్గతం చేసి, పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.