Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 7:39 pm Posted by : VARTHA SANDHYA DESK

రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కల్వకుంట్ల కవిత

  • రైతుల నుంచి రూ.1,200 కోట్ల కప్పం వసూలు చేశారని ఆరోపణ
  • రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర జరుగుతోందని విమర్శ
  • వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్
  • నల్గొండలో రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం


నల్గొండ, జూన్ 11 (వార్త సంధ్య): రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. నల్గొండలో నిర్వహించిన రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

వ్యవసాయరంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మట్టి తల్లిని అలుసుగా చూస్తూ వ్యవసాయాన్ని కర్మకు వదిలేశారని విమర్శించారు.

రూ.1,200 కోట్ల కప్పం వసూలు

రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, యూరియా సరఫరా, ధాన్యం కొనుగోళ్లు, సాగునీటి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

క్వింటాల్ ధాన్యానికి 6 కిలోల తరుగు తీస్తూ, రవాణా ఖర్చులను రైతులపైనే మోపుతూ దాదాపు రూ.1,200 కోట్ల మేర రైతుల నుంచి వసూలు చేశారని మండిపడ్డారు. రైతులకు రావాల్సిన బకాయి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతులు, రైతు కూలీలకు సాయం చేయాలి

రాష్ట్రంలో 36 శాతం మంది కౌలు రైతులేనని పేర్కొన్న కవిత, వారిని గుర్తించి రైతు భరోసా అందించాలని కోరారు. రైతు కూలీలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సాగునీటి సమస్యలపై ఆందోళన

నల్గొండ జిల్లాలో సాగునీటి కొరత తీవ్రంగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నల్గొండకు కూడా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దిండి ప్రాజెక్టు సోర్స్ పాయింట్ మార్పు ద్వారా నల్గొండ, పాలమూరు జిల్లాల మధ్య వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు.

అసైన్డ్ భూములను కాపాడుకోవాలి

అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిశ్రమల పేరుతో వాటిని స్వాధీనం చేసుకుంటోందని కవిత ఆరోపించారు. అసైన్డ్ భూములను రక్షించేందుకు ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రైతు డిస్కంపై అభ్యంతరం

రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం “రైతు డిస్కం” పేరుతో కుట్ర చేస్తోందని కవిత ఆరోపించారు. కొత్త డిస్కంను ఏర్పాటు చేసి విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.రైతులు ఈ అంశంపై అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత నియంత్రణ సంస్థలకు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు.

వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి

వ్యవసాయ రంగానికి పరిశ్రమలకు ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి పెట్టుబడులు, మార్కెటింగ్, బ్రాండింగ్, నిల్వ సదుపాయాలు, రుణాల విషయంలో ప్రత్యేక విధానం తీసుకురావాలని కోరారు.

జగిత్యాల మామిడి పండ్లకు బ్రాండ్ సృష్టించడం ద్వారా మార్కెట్ అవకాశాలు పెంచిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ప్రతి పంటకు మార్కెట్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

పది తీర్మానాల ఆమోదం

రౌండ్ టేబుల్ సమావేశంలో పది కీలక తీర్మానాలను ఆమోదించినట్లు కవిత తెలిపారు. వాటిలో రైతు డిస్కం రద్దు, యూరియా యాప్ తొలగింపు, బకాయి రైతు భరోసా చెల్లింపులు, కౌలు రైతులకు గుర్తింపు, రైతు కూలీలకు ఆర్థిక సాయం, నకిలీ విత్తనాలు, పురుగుమందులపై కఠిన చర్యలు, మూసీ కాలుష్య నివారణ, నిమ్మ-బత్తాయి రైతులకు మద్దతు, పత్తి రైతుల సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఉన్నాయి.

రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రకటిస్తున్న 5 వేల కానిస్టేబుల్ పోస్టులను 20 వేలకు పెంచాలని, ఇతర ఉద్యోగాలకు కూడా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు.

జూలై 2న భూపోరాటం

ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన భూముల కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

బత్తాయి రైతుల సమస్యలపై పోరాటం

నల్గొండ జిల్లా మాడుగుల మండలం ఇందుగుల గ్రామంలో బత్తాయి తోటలను సందర్శించిన కవిత, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. బత్తాయి, నిమ్మ, పత్తి రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.