భద్రాద్రి, జూలై 02 (వార్త సంధ్య) : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్ కమ్యూనిటీ హాల్‌లో గురువారం నాడు ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సీ రివిజన్) కార్యక్రమం 8వ రోజూ విజయవంతంగా కొనసాగినట్లు జీపీఓ పావని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని చెప్పారు. ఓటరు నమోదు, వివరాల సవరణ, అవసరమైన పత్రాల సమర్పణకు సంబంధించిన సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తూ, ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను పూర్తిగా నమోదు చేసి, అవసరమైన పత్రాలను సంబంధిత బీఎల్‌ఓలకు (బూత్ లెవెల్ ఆఫీసర్) అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.