-
రూ.25 లక్షల విలువైన నిత్యావసర కిట్లు పంపిణీ
-
టిఎన్ఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా
-
కొత్తగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లో పంపిణీ
కొత్తగూడెం–పాల్వంచ (వార్త సంధ్య) – మార్చి 15: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని టిఎన్ఆర్ (తాండ్ర నారాయణరావు) ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రూ.25 లక్షల విలువైన రంజాన్ తోపా కిట్లను 3 వేల పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు మరియు మహ్మద్ కాజిం అలీ (యుఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించారు.పాల్వంచలోని పాత పాల్వంచ ప్రాంతంలో జరిగిన తోపా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా మాట్లాడుతూ పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా నిత్యావసర ఆహార పదార్థాలను అందించడం అభినందనీయమని అన్నారు. కొత్తగూడెం మరియు అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 3 వేల కుటుంబాలకు తోపా కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.ప్రతి కిట్‌లో బియ్యం, బిర్యానీ రైస్, గోధుమ పిండి, వంట నూనె, సేమ్యా, పంచదార, జీడిపప్పు, కిస్‌మిస్, ఎండు కొబ్బరి, ఖర్జూరం, పాలు, నెయ్యి, బిర్యానీ మసాలా తదితర 14 రకాల నిత్యావసర ఆహార పదార్థాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టే పేద ముస్లిం కుటుంబాలకు పండుగ సమయంలో సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ, ములకలపల్లి ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో తోపా కిట్లు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, ట్రస్ట్ కార్యదర్శి నరాటి ప్రసాద్, సలహాదారులు తాండ్ర లక్ష్మణ్‌రావు, ఇనుగంటి రాము, తాండ్ర నాగబాబు, ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి, కార్పొరేటర్ జి.వెంకటేశ్వర్లు, రావి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ టిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలో రూ.35 లక్షల వ్యయంతో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, కెపీ జగన్నాధపురం హైస్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం, పలు కాలనీల్లో తాగునీటి బోర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.