Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 8:14 pm Posted by : VARTHA SANDHYA DESK

2బిహెచ్‌కే ఇండ్లలో నివాసం లేకుంటే రద్దు: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హెచ్చరిక

  • మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
  • కేటాయించిన ఇండ్లలో తప్పనిసరిగా నివాసం ఉండాలని సూచన
  • మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులకు ఆదేశాలు


రంగారెడ్డి జిల్లా, మార్చి 17 (వార్త సంధ్య):డబుల్ బెడ్ రూమ్ (2బిహెచ్‌కే) ఇండ్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా తమకు కేటాయించిన ఇండ్లలో నివాసం ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. ఇప్పటికే ఇండ్లు కేటాయించబడినప్పటికీ నివాసం ఉండని వారి ఇండ్లను నోటీసులు జారీ చేసి రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు.

బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.జిల్లాలో పూర్తి అయిన మరియు నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులైన పేదలను ఎల్2 లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసిన లిస్ట్‌కు జిల్లా మంత్రి ఆమోదం తీసుకొని గజిటెడ్ అధికారుల ద్వారా ధృవీకరణ చేయాలని తెలిపారు.

ఇప్పటికే ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఈ నెల 31లోపు తమ ఇళ్లలో నివాసం ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. లేనిపక్షంలో ఏప్రిల్ మొదటి వారంలో ఆ ఇండ్ల కేటాయింపులను రద్దు చేసి కొత్త లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.అన్ని హౌసింగ్ కాలనీలలో విద్యుత్, త్రాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే ఖాళీగా ఉన్న భూములను గుర్తించి కొత్త ఇండ్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

డబుల్ బెడ్ రూమ్ కాలనీలలో ఉన్న దుకాణాలను వేలం వేసి వచ్చిన నిధులను కాలనీల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సమన్వయంతో పని చేసి గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్, జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ డి. చాంప్లా నాయక్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, హౌసింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.