Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 12:53 pm Posted by : govindhu13@gmail.com

సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసత్య ప్రాణాలను తిప్పిగొట్టిన

పత్రికాప్రకటన
20.07.2026, సోమాజిగూడ, ప్రెస్ క్లబ్, హైదరాబాద్.

*నేను ఉపనిషత్ స్ఫూర్తికి భక్తుణ్ణి…* *విగ్రహానికి కాదు*
విజయవిహారం రమణమూర్తి

“నేను ఉపనిషత్తుల తాత్విక స్ఫూర్తికి కట్టుబడి మాట్లాడుతున్నాను.
రాముడు కేంద్రంగా వున్నదే హిందూయిజంగా నేను అంగీకరించడం లేదంటే – రాముడిని దూషిస్తున్నానని ఎంతమాత్రం కాదు. నేను ద్వేషాన్ని అసమానతను వ్యతిరేకిస్తున్నాను. అది వేదాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, ఖురాన్ లో, బైబిల్లో ఎక్కడున్నా సరే…”అని విజయవిహారం రమణమూర్తి అన్నారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తాను జైశ్రీరామ్, సీతారామ్ అని పారవశ్యంతో అంటాను కానీ అది ఒక తాత్వికమైన అక్షర తత్వాన్ని, చరాచరస్థితమైన పరబ్రహ్మ తత్వాన్ని ఉద్దేశించే అంటానని అన్నారు.

ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో సోషల్ మీడియాలో వెల్లువెత్తేవన్నీ అసత్య ప్రచారాలు అని ఖండిస్తూ – అనేక విషయాలను ప్రస్తావించారు.
“…. అయోధ్య రామాలయానికి సంబంధించి అవకతవకలు జరిగాయని అక్కడి ప్రధాన పూజారి బాబాలాల్ దాస్ గారు లాంటి వాళ్లు చేసిన ఆరోపణలనే నేను ప్రస్తావిస్తే నేరమైందా? దానిమీద సమగ్రమైన దర్యాప్తు జరిపించే బాధ్యతను ప్రభుత్వం ఎందుకు గుర్తించదు. దీన్ని హిందూ సమాజం తరఫున ప్రశ్నిస్తే అది నేరమా?
అలాగే కృష్ణ భగవానుడి చిత్రాల్లోని తల భాగంలో మోడీగారి తల తాలూకు చిత్రాన్ని అతికించడం దైవాపచారం కాదా?
రామచంద్రుడిని మోడీగారి భుజంపై సేదతీరే దృశ్యం హిందూ సమాజానికి అంగీకారమేనా?
బాలరాముడి వేలుపట్టుకొని నడిపించడం భావ్యమేనని ఏ హిందువు భావిస్తాడు?

గోరక్షకుల పేరిట అమాయక వ్యక్తులపై హత్యలకు దిగడాన్ని ఇటీవలే ఓ డిబేట్లో ప్రస్తావిచినప్పుడు – ఇదే కశ్యప్ రెడ్డి కోపంతో ఊగిపోతూ వేలు చూపుతూ, కచ్చితంగా చంపితీరుతాం అని అనేకసార్లు బెదిరించాడు.
భాగవత్ గారు, మోదీగారు కూడా ఇలాంటి హత్యాకాండ ఏమాత్రం తగదని వారించారని గుర్తుచేస్తే – వారేమీ హిందూమతానికి టేకేదార్లు కాదు… మేం చేయాలనుకున్నది చేసితీరతాం అని కశ్యప్ రెడ్డి బెదిరించడం ఉన్మాదం కాదా!
గోవధ ఎక్కడ జరిగినా వాళ్లని చంపిపారేసే హక్కు మాకు కావాలని అడిగిన అతగాడి మానసిక స్థితి ఎలాంటి పెడధోరణిలో వుందో ఊహించవచ్చు.
మొన్న నాపై దాడిజరిగిన డిబేట్లో కేవలం తలకాయ అన్న మాటను అన్నందుకు నన్ను చంపేయాలన్నంత ఉన్మాదానికి దిగాడు..తలకాయ అన్నది అచ్చమైన తెలుగుమాటే కాని బూతు పదమేం కాదు. ఇందులో కృష్ణుడిని అవమానపరిచిందేమిటి?
నా నేపథ్యం గురించి కూడా పూర్తి అసత్యమైన, అసందర్భమైన ప్రచారాలు కొన్ని చానెళ్లలో జరుగుతున్నాయి. గతంలో ఓ మహిళా వేదికపై మాట్లాడే వీడియోను కత్తిరించి, నన్ను దైవదూషకుడిగా చిత్రిస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవం…ఏమతంలోనైనా అసమానత్వాలకి వ్యతిరేకమైన అంశాలుంటే వ్యతిరేకించడానికి ఎప్పుడూ వెనకాడలేదు. ఎలాంటి శషభిషల్లేవు. నేను స్ఫూర్తికి భక్తుణ్ణి… విగ్రహానికి కాదని ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అవును… రామాయణంలో శూర్పణఖ, శంభూకవధ గురించి ప్రస్తావించాను. అదేసమయంలో రామచంద్రుడి ఉత్తమగుణాలను, విలువల్ని కూడా ఎన్నోసార్లు ప్రస్తావించాను… అభ్యంతరకరమైన విషయాలను విమర్శించడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా… తిరస్కరించాల్సిన అంశాల్ని బాహాటంగా చెబితే తప్పై పోయిందా? నేను కొత్తగా మారిందీ లేదు… వేషమేదో మార్చిందీ లేదు… వేదాల్లోనూ, ఉపనిషత్ లలోనూ గొప్ప విషయాల గురించి చెబుతూనే వున్నాం… హిందూమతంలోని ఉన్నత విలువల్ని, ద్వేషం అసమానత్వాలకి వ్యతిరేకంగా వున్న అంశాల గురించి విస్తారంగా ఎలుగెత్తి చాటుతూనే వీన్నాం… మరి నేనెట్లా హిందూ వ్యతిరేకినయ్యానో విమర్శకులకే తెలియాలి…
అబేధ దర్శనం ఙ్ఞానం అన్న మాట నాకు ఆచరణీయం. అనుసరణీయం.
మరోసారి చెబుతున్నా… నేను హిందువుగానే పుట్టాను. హిందువుగానే వుంటాను. హిందువుగానే మరణిస్తాను..
హిందూమతంలో ఎన్నో స్రవంతులున్నాయి. వీటిలో ఆర్యసమాజం, అలేఖ సంప్రదాయం వంటివి రాముడిని అంగీకరించలేదు. మరి ఆ సంప్రదాయాలన్నింటినీ హిందూమతం నుంచి వేరు చేద్దామా?
సర్వమూ ఈశ్వరమయమే అన్న ఉపనిషత్తు స్ఫూర్తికి నేను కట్టుబడివున్నవాణ్ణి. ఉపనిషత్తులు నాకు అత్యంత పరవశాన్ని, అలౌకకమైన స్ఫూర్తిని కలిగిస్తూవుంటాయి.

ఇప్పుడు నేను దైవదూషణ చేసినట్టు వైరలవుతున్న వీడియోలో మహిళల్ని రాజకీయంగా, సామాజికంగా, కుటుంబపరంగా ఎట్లాంటి దారుణమైన వివక్షను, అవమానాల్ని ఎదుర్కొంటున్నారో వివరించాను. ఆ సందర్భంలో మన పురాణాల్లోని, ఖురాన్ లోని, బైబిల్, బౌద్ధ మతాల్లోని వివక్షతా పూర్వక అంశాలను ప్రస్తావించాను. కాని మన పౌరాణిక పదేవుళ్లగురించిన క్లిప్పింగును మాత్రమే ఎడిట్ చేసి వైరల్ చేయడం దారుణం, అనైతికం… నన్ను దైవద్రోహిగా చిత్రించాలని చూస్తున్నారు. కానీ వివక్షకీ, ద్వేషానికీ, అసమానత్వాలకి సంబంధించిన అంశాలెక్కడున్నా ఇవాల్టికీ విమర్శిస్తాను…ఈ విషయంలో నేనేమీ మాట మార్చడం లేదు… కొత్తగా ఏ వేషమూ కట్టలేదు..అని రమణమూర్తి అన్నారు.

రామాయణంలో శూర్పణఖ ఉదంతాన్ని చాలామంది విఙ్ఞులు, మేధావులు, పండితులు విమర్శించారు. నాక్కూడా అది విమర్శనీయమే… అదే నేను చెప్పాను…
అలాగే కృష్ణ భగవానుడి రాసలీలా ఘట్టం కూడా నాకు అత్యంత పారవశాన్ని కలిగిస్తుంది.

విజయవిహారం పత్రికా నాటి నుండి నామీద పెట్టిన కేసులన్నీ కల్పితాలూ, అసత్యాలనీ గౌరవ కోర్టులు ఇప్పటికే తీర్పులు వెలువరించాయి. ఐనప్పటికీ నా మీద వ్యక్తిగత దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారో తీవ్రంగా ఖండిస్తున్నాను. వచ్చే 24 గంటల్లో నా మీద అసత్య వార్తలతో చేసిన వీడియోలను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో న్యాయ పరిణామాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని హెచ్చరిస్తున్నాను.

ఈసమావేశంలో హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ అధ్యక్షులు, అలేఖ్ సంప్రదాయానికి చెందిన సాధు త్రినాథ దాస్ గారు మాట్లాడుతూ వైవిధ్యం కలిగినదే హిందూమతమని, వేల ఏళ్లుగా విభిన్న స్రవంతులు మధ్య సమన్వయంతో, సామరస్యంతో ఈ ధార కొనసాగుతోందని – కాని ద్వేషంతో తెగబడుతున్న శక్తులనుంచి హిందూమతాన్ని కాపాడుకుంటామని తెలిపారు

హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ (HPE) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో HPE జాతీయ అధ్యక్షులు స్వామి త్రినాథ దాస్ గురూజీ, జైభారత్ జాతీయ కార్యదర్శులు రజనీ, లోక్ నాథ్, అచలతత్వ్య ప్రచారకులు దున్న ఇద్దాసు పీఠం వారసులు దున్న లక్ష్మీశ్వర్ పాల్గొన్నారు.

ఇట్లు
అధికార ప్రతినిధి
హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ (HPE)