సీపీఐలో చేరాలని మరోసారి కూనంనేని ఆహ్వానం
దేవజీ, సంగ్రామ్, చంద్రన్న రాష్ట్ర నాయకత్వాన్ని కలిసిన నేతలు
కేవలం మర్యాదపూర్వక సమావేశమే దేవజీ స్పష్టీకరణ
భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 30 (వార్త సంధ్య) : అటవీ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు కమ్యూనిస్టుల మాతృ సంస్థ అయిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)లో చేరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఆహ్వానం పలికారు. మాజీ మావోయిస్టు అగ్రనేతలు దేవజీ (టిప్పిరి తిరుపతి), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పుల్లూరి ప్రసాద్‌రావు (చంద్రన్న) శనివారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం దేవజీ మాట్లాడుతూ, తాము సీపీఐ నాయకత్వాన్ని కేవలం మర్యాదపూర్వకంగా కలిసేందుకే వచ్చామని తెలిపారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కాగా మాజీ మావోయిస్టులను ప్రజాస్వామ్య రాజకీయాల్లో భాగస్వాములు కావాలని సీపీఐ నాయకత్వం సూచించినట్లు సమాచారం.