Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 9:58 pm Posted by : VARTHA SANDHYA DESK

సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి : ఏఐఎస్ఎఫ్

భద్రాద్రి, జూలై 06 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు, ఏఎన్ఎంలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున దోమతెరలు పంపిణీ చేసి, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేయాలని, మెస్ నిర్వహణను మెరుగుపరచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, వర్కర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ, ఉమా నాయక్, మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.