Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 5:22 pm Posted by : జడల నాగప్రసాద్

రికవరీ దందాపై ఆర్బిఐ ఉక్కుపాదం

ఐఐబీఎఫ్ సర్టిఫికెట్ లేని ఏజెంట్లకు నో ఎంట్రీ

ఫోన్ లోన్ డిఫాల్ట్ అయినా పూర్తిగా బ్లాక్ చేయరాదు

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి

బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత పారదర్శకతకు ఆర్బీఐ చర్యలు

రికవరీ దందాపై ఆర్బీఐ ఉక్కుపాదం

కస్టమర్ల హక్కులకు పెద్దపీట వేసిన ఆర్బీఐ

రుణ వసూళ్లలో ‘మర్యాద’ తప్పనిసరి

వేధింపులపై ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ

డిజిటల్ అవమానాలకు చెక్ పెట్టనున్న కొత్త చట్టం

రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్‌

కఠిన మార్గదర్శకాలతో ఆర్బీఐ ముందుకు

 

 

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 22 (వార్త సంధ్య) : బ్యాంకు రుణాలు తీసుకున్న వినియోగదారులను రికవరీ ఏజెంట్లు వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లోన్ రికవరీ పేరుతో దుర్భాషలాడడం, బెదిరింపులు చేయడం, కుటుంబ సభ్యులు లేదా బంధువులకు ఫోన్ చేసి అవమానించడం వంటి చర్యలకు కట్టడి విధించేలా కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.

 

‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వాణిజ్య బ్యాంకులు – బాధ్యతాయుత వ్యాపార నియమావళి) సవరణ మార్గదర్శకాలు – 2026’ పేరుతో విడుదల చేసిన ముసాయిదాపై ఈ నెల 31 వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించనుంది. అనంతరం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది.

ఇక వేధింపులకు సెలవు ! :

కొత్త నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లకు ఫోన్ చేయాలి. తరచూ కాల్స్ చేసి మానసిక ఒత్తిడి కలిగించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం, బెదిరించడం పూర్తిగా నిషేధం.

 

అంతేకాకుండా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం లేదా కుటుంబ సభ్యులు, మిత్రులకు పంపడం కూడా నేరంగా పరిగణించనున్నారు.

బ్యాంకులకే పూర్తి బాధ్యత :

రికవరీ ఏజెంట్లు తమ ఉద్యోగులు కాదని ఇప్పటివరకు బ్యాంకులు తప్పించుకునే పరిస్థితికి ముగింపు పలుకుతూ, ఇకపై ఏజెంట్లు చేసే తప్పులకు సంబంధిత బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 

రికవరీ ఏజెన్సీల వివరాలు, వారి అధికారిక గుర్తింపు, ఫిర్యాదు విధానం వంటి సమాచారాన్ని బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలి.

ఐఐబీఎఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి :

లోన్ రికవరీ ఏజెంట్లుగా పనిచేసే వారికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) సర్టిఫికేషన్ తప్పనిసరి చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. దీని ద్వారా శిక్షణ పొందిన వారే రికవరీ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఫోన్ పూర్తిగా బ్లాక్ చేయరాదు :

లోన్‌పై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్‌కు సంబంధించిన డిఫాల్ట్ కేసుల్లో కూడా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఆ ఫోన్‌ను పూర్తిగా బ్లాక్ చేయరాదని ముసాయిదాలో స్పష్టం చేసింది. వినియోగదారుల ప్రాథమిక కమ్యూనికేషన్ హక్కులను పరిరక్షించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వినియోగదారులకు ఊరట : 

రికవరీ ఏజెంట్ల వేధింపులతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది రుణగ్రహీతలకు ఈ మార్గదర్శకాలు పెద్ద ఊరటనివ్వనున్నాయి. బాధ్యతాయుత బ్యాంకింగ్ వ్యవస్థకు ఇవి కీలక అడుగులుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.