Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 7:20 pm Posted by : VARTHA SANDHYA DESK

మతసామరస్యం తో ముందుకు సాగాలి: ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ సందేశం

హైదరాబాద్ సిటీ ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15 : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రంజాన్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు.

రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది ఆత్మశుద్ధి చేసుకునే పవిత్ర సమయమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. మతసామరస్యం, సోదరభావంతో కలిసి మెలిసి జీవించడం సమాజానికి ఎంతో అవసరమని ఆయన అన్నారు.

ప్రభుత్వం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం తెలిపారు. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి, సీనియర్ నాయకుడు ముహమ్మద్ అలీ షబ్బీర్‌కు సలహాదారు పదవి ఇచ్చినట్లు గుర్తుచేశారు. అలాగే ఎనిమిది మంది మైనారిటీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామని పేర్కొన్నారు.

క్రీడాకారులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు రెండు కోట్ల రూపాయల నగదు బహుమతి ఇచ్చి ప్రోత్సహించామని చెప్పారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో మైనారిటీలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, వాటి వల్ల అనేక మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు.

ఈ ప్రభుత్వం ప్రజలదేనని, తాను కూడా ప్రజల సోదరుడినని సీఎం పేర్కొన్నారు. కొందరు మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టి అందరూ కలిసి తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి విషయంలో తెలంగాణను ముందంజలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు.