Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 7:50 pm Posted by : VARTHA SANDHYA DESK

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స

  • కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రావాలి

  • పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందానికి ప్రశంసలు

  • పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల కృషి అభినందనీయం  : ఎమ్మెల్యే కూనంనేని


కొత్తగూడెం కార్పొరేషన్ (వార్త సంధ్య) – మార్చి 15: పేదవర్గాలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించి మరింతగా ప్రోత్సహించాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చుతో చేయాల్సిన మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయం అని ఆయన పేర్కొన్నారు. పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్సపై ఆదివారం ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులు మరియు వైద్య బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు. అలాగే ఆసుపత్రిని నిత్యం పర్యవేక్షిస్తూ పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్న డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, ఆర్ఎంఓ డాక్టర్ సోమరాజుదొరలను ప్రత్యేకంగా అభినందించారు.తన నియోజకవర్గ పరిధిలోని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి శస్త్రచికిత్స జరగడం ఆనందకరమని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో కొంతమేర నమ్మకం తగ్గుతున్న నేపథ్యంలో పాల్వంచలో జరిగిన ఈ మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స సామాన్య మరియు పేద వర్గాల ప్రజల చూపును తిరిగి ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మళ్లించేలా చేస్తుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు.