దౌల్తాబాద్ ప్రతినిధి (వార్త సంద్య )అక్టోబర్4 : పోషణ మాసం సందర్భంగా “మన అంగన్వాడీ – మన బాధ్యత” అనే థీమ్‌తో దౌల్తాబాద్ సెక్టార్ పరిధిలోని దొమ్మాట గ్రామంలో సెక్టార్ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆహార వైవిధ్యం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం, అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యాంసన్, సూపర్వైజర్ రేణుక మాట్లాడుతూ గర్భిణీలు ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పాలు, గుడ్లు, పండ్లు, చిరుధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలను క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.
అశ్రిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గణేష్ బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బాల్యవివాహంపై సమాచారం తెలిసిన వెంటనే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం ద్వారా రెండవసారి ఆడపిల్ల జన్మించిన చిన్నారులకు సర్పంచ్, ఉప సర్పంచ్ చేతుల మీదుగా బేబీ కిట్లు పంపిణీ చేశారు. గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవిగారి ఆంజనేయులు, ఉప సర్పంచ్ అక్కమ్మల రేవతి, వార్డు సభ్యులు నరేష్, భాను, ఎఎన్ఎం శైలజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.