
🚨 బ్రేకింగ్ న్యూస్ | కామారెడ్డి
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదన – ముగ్గురు అరెస్ట్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 24 ( వార్తా సంధ్య )
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నెం.316/2025లో భూమిని నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో, కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1, ప్లాట్ నెం.71 అసలు యజమాని ముక్తవరం వెంకటయ్య పేరుమీద ఉండగా, ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో కుట్ర పన్ని, తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా చూపించాడు. అలాగే తన మామ సంగారెడ్డిని అసలు యజమానిగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నిలబెట్టి, నకిలీ గుర్తింపు పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
తర్వాత అదే స్థలాన్ని అసలు విషయాన్ని దాచిపెట్టి ఇతరులకు విక్రయించడంతో పాటు, ఆ స్థలం పలువురి పేర్లకు వరుసగా రిజిస్ట్రేషన్ అయినట్లు విచారణలో తేలింది.
ఈ కేసులో బండారి శ్రీనివాస్ రెడ్డి, బండారి సునీత, సంగారెడ్డిలను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
జిల్లా ఎస్పీ సూచనలు:
భూములు కొనుగోలు చేసే ముందు యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్ చరిత్ర, రెవెన్యూ రికార్డులు, సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించాలని ప్రజలకు సూచించారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసి ప్రజలను మోసం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.