Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:08 pm Posted by : జడల నాగప్రసాద్

డిప్యూటీ సీఎం పై మాజీ మంత్రి ఫైర్ ….

ఖమ్మం, జూన్ 22 (వార్త సంధ్య) : మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కేళ్లపల్లి రవీందర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు తదితరులు పాల్గొన్నారు. పువ్వాడ మాట్లాడుతూ, 2009లో మధిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌గా మారిన తర్వాత భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ దాదాపు విజయం సాధించినప్పటికీ, కొందరు నాయకుల పార్టీ మార్పులతో ఓటమి ఎదురైందని పేర్కొన్నారు.

తాను మంత్రిగా ఉన్న సమయంలో మధిర నియోజకవర్గంలో ట్యాంక్‌బండ్, సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ చౌరస్తా, రహదారులు, తాగునీటి సదుపాయాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. దళిత బంధు పథకంలో భాగంగా చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వేలాది దళిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలులో విఫలమైందని ఆరోపించిన ఆయన, “మధిర నియోజకవర్గంలోని ఏ గ్రామంలో 100 శాతం రుణమాఫీ జరిగిందో చెప్పగలరా?” అంటూ డిప్యూటీ సీఎం భట్టికి సవాల్ విసిరారు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తల అంకితభావాన్ని కొనియాడిన పువ్వాడ, కార్యకర్తల కష్టమే పార్టీకి బలమని అన్నారు. రాబోయే రోజుల్లో మధిర గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.