జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నేడు
జూలై 13న ఆల్బెండాజోల్ మాత్రలు – జూలై 20న మాప్-అప్ రౌండ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 12
(వార్త సంధ్య)
కామారెడ్డి: పిల్లలను నులిపురుగుల సమస్య నుంచి రక్షించి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (National Deworming Day – 2026) నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి జె. వెంకటి తెలిపారు. ఆ రోజు మాత్ర తీసుకోలేని వారికి జూలై 20న మాప్-అప్ రౌండ్ ద్వారా ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయనున్నట్లు వెల్లడించారు.
నులిపురుగులు పిల్లల శరీరంలోని పోషకాలను గ్రహించి రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, ఏకాగ్రత తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలకు కారణమవుతాయని పేర్కొన్నారు. ఈ సమస్యను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫారసు చేసిన సురక్షితమైన ఆల్బెండాజోల్ మాత్రను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం 2,46,177 మంది 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు ఈ కార్యక్రమం ద్వారా మాత్రలు అందజేయనున్నారు. అంగన్‌వాడీ చిన్నారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకుల, కస్తూర్బా, ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులతో పాటు పాఠశాలకు వెళ్లని పిల్లలకు కూడా ఈ మాత్రలు అందజేస్తారు.
1–2 సంవత్సరాల చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి, 2–19 సంవత్సరాల వారికి 400 మిల్లీగ్రాముల పూర్తి మాత్రను నమిలి మింగేలా శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో అందజేయనున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు జూలై 13న తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్ర తీసుకునేలా చూడాలని, ఆ రోజు తీసుకోలేకపోతే జూలై 20న నిర్వహించే మాప్-అప్ రౌండ్‌లో తప్పకుండా తీసుకునేలా సహకరించాలని జిల్లా వైద్యాధికారి కోరారు.
నులిపురుగుల నివారణకు మాత్రలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని, భోజనం ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం, చెప్పులు ధరించడం, పరిశుభ్రమైన నీటిని ఉపయోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలని సూచించారు.
“ప్రతి బాలబాలికకు ఆల్బెండాజోల్ మాత్ర – ఆరోగ్యవంతమైన తెలంగాణ, అభివృద్ధి చెందిన భారతదేశం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జె. వెంకటి విజ్ఞప్తి చేశారు.