హైదరాబాద్ /ఖమ్మం, (వార్త సంధ్య) – మార్చి 15: గౌడీకం నిర్వహించే వనం మైసమ్మ, కంఠ మహేశ్వరులు చల్లగా కాపాడాలని, వారి వృత్తిలో ఆ దైవం నిరంతరం అండగా నిలిచి వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. గౌడ వృత్తిదారులు తాటి చెట్లపై నుంచి పడిపోయి మరణించే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, వెంటనే వారికి రక్షిత యంత్రాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో వారి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాయకన్ గూడెం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ శ్రీ సురమాంబ కంఠమహేశ్వర దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ శనివారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గెలిచిన వెంటనే గౌడుల డిమాండ్లను తీర్చుతానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలకుపైగా గడిచినా స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. గౌడ వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకన్ గూడెం గ్రామ గౌడ నాయకులు మండవ నర్సయ్య, దొంతగాని నర్సయ్య, గ్రామ మాజీ సర్పంచ్ కాసాని సైదులు, మండవ వీర నాగులు, బుడిగ వెంకన్న, టీచర్ మండవ నర్సయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కాసాని నరేష్, గుండు వెంకట నారాయణ, బెల్లంకొండ నర్సింహా రావు, కాసాని నాగేశ్వరరావు, మండవ శ్రీరాం, మండవ సైదులు, మండవ అంజయ్య స్వామి, మండవ తిరుపతి, గునిగంటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.