- నిద్రలో పంచాయతీ యంత్రాంగం..!
- చెత్తతో జామ్ అయిన కాల్వలు..
- దుర్వాసనతో నరకయాతన
- వర్షాకాలంలో దోమల విజృంభణ..
- చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన
- ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?
- సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం
- అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 04 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొత్త కాలనీలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. కాల్వలు మురుగు నీటితో నిండిపోవడమే కాకుండా చెత్తాచెదారంతో పూర్తిగా మూసుకుపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వల నుంచి వెలువడుతున్న భరించలేని దుర్వాసనతో ప్రజలు ఇళ్లలో కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో నిల్వ నీరు పేరుకుపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామ సర్పంచ్‌కు, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు సమస్యను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారా లేదా అనే అనుమానం కలుగుతోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు కనీస పారిశుద్ధ్య నిర్వహణలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. “పెద్ద ప్రమాదం జరిగితేనే అధికారులు మేల్కొంటారా? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఎవరిది?” అంటూ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి కాల్వలను శుభ్రం చేయించి, నిల్వ నీటిని తొలగించి, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కొత్త కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.